యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `తండేల్`. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. పాకిస్థాన్ సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లి అక్కడి నేవీ చేతికి చిక్కిన శ్రీకాకుళం జిల్లా జాలర్ల జీవితం నేపథ్యంలో తండేల్ స్టోరీ సాగుతుంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చైతు మత్సకార యువకుడిగా నటించాడు. అతని ప్రేయసిగా సాయి పల్లవి అలరించబోతోంది.
తండేల్ మూవీని 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ ఉండటంతో.. పోటీ నుంచి తండేల్ తప్పుకుంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను గీతా ఆర్ట్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ ను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది.
అయితే కొత్త రిలీజ్ డేట్ పట్ల అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఫిబ్రవరి అన్ సీజన్. పరీక్షల హడావుడి స్టార్ట్ అవుతుంది. అలాంటి టైమ్ లో తండేల్ వంటి రూ. 100 కోట్ల చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకోవడం పెద్ద రిస్కే. కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడుతుంది. అదే సంక్రాంతి సీజన్ లో వస్తే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో తిరిగే ఉండదు. సంక్రాంతి వంటి కీలక సీజన్ ను వదులుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారు.