ఉమ్మడి అనంతపురంలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దాదాపు 35 ఏళ్లకుపైగానే ఈ నియోజకవర్గం జేసీ(జున్నూరు చంటి) బ్రదర్స్ చేతిలో ఉంది. గత ఎన్నికల్లో మాత్రం ఈ బ్రదర్స్ హవాకు చెక్ పెడుతూ.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. ఇక, అక్కడ నుంచి జేసీ వర్సెస్ కేతిరెడ్డి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు జెండాల జగడం ముసురుకుంది.
తాడిపత్రిలోని సీబీ రోడ్డులో నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అయితే.. డివైడర్ల మధ్యలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు కొన్నాళ్ల కిందట వైసీపీ జెండాలను కట్టారు. ఇవి.. విద్యుత్ దీపాల అలంకరణకు అడ్డుగా ఉన్నాయి. అయినప్పటికీ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలతో వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ఇష్టపడలేదు. పైగా మున్సిపల్ సిబ్బంది పని ప్రారంభించిన తర్వాత.. వైసీపీ నేతలు అక్కడే ఉండి అంతా పర్యవేక్షించారు.
ఈ విషయం మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలియడంతో ఆయన రోడ్డెక్కారు. వైసీపీ జెండాలను తొలగించి లైట్లు వేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఇంతలో రంగంలొకి దిగిన పోలీసులు వైసీపీ జండాలను తొలగించడానికి వీల్లేదని మునిసిపల్ ఉద్యోగులకు అడ్డుపడ్డారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి తన అనుచరులను కూడా రంగంలోకి దింపారు. మొత్తంగా ఇప్పుడు జెండాల జగడంతో నియోజకవర్గం రాజకీయం కాకెక్కింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.