అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లా గుడివాడకు చేరుకుంది. అయితే, మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో పాదయాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందన్న నేపపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా భారీ సంఖ్యలో పోలీసులను ఉన్నతాధికారులు మోహరించారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు రాకముందే గుడివాడలోని కీలక ప్రాంతాలలో పోలీసులు ముందుగానే పాదయాత్ర చేస్తూ కవాతు నిర్వహించారు.
గుడివాడలో పోలీసు ఆంక్షలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ఆ ఆదేశాలను పాటించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. మరోవైపు, అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. గుడివాడ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించడంతో అక్కడ రైతులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
పాదయాత్రలో ‘జై అమరావతి, జై జై అమరావతి. ఒక రాష్ట్రం ఒకే రాజధాని’ అంటూ నినాదాలు చేస్తున్నారు. గుడివాడలో అమరావతి రైతులకు ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అమరావతినే రాజధానిగా ప్రకటించేలా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుతూ అమ్మవారికి రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దారి పొడవునా రైతులకు మహిళలు హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొట్టి, దిష్టి తీశారు.
గుడివాడ మార్కెట్ యార్డు వద్దకు పాదయాత్ర చేరుకుంటున్న తరుణంలో రైతులకు మద్దతుగా భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో, అనుమతుల పేరుతో తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.