పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారలేదని అంటున్నారు అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం రాజకీయ పరిశీలకులు. టీడీపీకి పట్టుకోమ్మ వంటి జిల్లాలో సంఖ్యకు నేతలు ఎక్కువే అయినా.. పార్టీని బలోపేతం చేసేవారే తక్కువగా ఉండడం గమనార్హం. అదేసమయంలో ఆధిపత్య పోరులో నాయకులు అలిసిపోతున్నారే తప్ప.. పార్టీకోసం ప్రయత్నిస్తున్నారు.. పార్టీని అభివృద్ధి చేయాలని తపిస్తున్నవారు కనిపించడం లేదు.
మరీముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో నాయకుల మధ్య పోరు నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి కీలక నాయకుడు. అయితే.. కాంగ్రెస్ నుంచిటీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అర్బన్లోనూ తనహవానే చలామణి అవ్వాలనే ధోరణిని ప్రదర్శించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ.. ప్రభాకర్ చౌదరిని తృణ ప్రాయంగా తీసి పారేశారు. అనంతపురం రోడ్డు విస్తరణ విషయంలో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలి వానగా మారి.. ఎవరికి వారు ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకువచ్చింది.
ఈ పరిణామమే వైసీపీకి కలిసి వచ్చి.. అర్బన్‌లో పాగా వేసింది. ఇక, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్ కుమార్‌రెడ్డి వచ్చారు. వ్యక్తులు మారినా.. రాజకీయాలు మాత్రం మారలేదు. ప్రభాకర్ చౌదరిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో తమ మాటే చెల్లుబాటు అయ్యేలా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి జేసీ కుటుంబం టీడీపీలో చేరడం ప్రభాకర్ చౌదరికి ఇష్టం లేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన సర్దుకు పోతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ప్రధానంగా అనంతపురం నగరంలోని రోడ్డు వెడల్పు విషయంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ దివాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ వీడతారనే దాకా ప్రచారం సాగింది. అంతిమంగా రోడ్డు వెడల్పు కోసం ఉత్తర్వులు కూడా జారీ చేయించుకున్నారు. కానీ అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. దీని వెనుక ప్రభాకర్ చౌదరి మంత్రాంగం నడిపారనే ప్రచారం ఉంది. రోడ్డు వెడల్పు పనులు జరగకుండా వ్యాపారులను ఎగదోసి అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది.
ఇక, ఇప్పుడు పవన్ కూడా ప్రభాకర్ చౌదరిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం.. ప్రభాకర్ ఈ దూకుడుకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకోవడంతో మరోసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల వివాదం రచ్చకెక్కింది. మరి ఈ పరిస్థితి ఎప్పటికి సర్దుబాటు అవుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.