రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గవర్నర్లు బీజేపీకి సానుకూల నాయకులుగా పేరున్న వారు. తెలంగాణ గవర్నర్ అయితే.. తమిళనాడు బీజేపీ చీఫ్గా చేసి వచ్చారు. ఇక, ఏపీ గవర్నర్ అయితే..ఆర్ ఎస్ ఎస్వాది. అయితే.. ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా అంతా నేనే అంటుంటారు. ప్రభుత్వంపై పోరు కు రెడీ అంటారు. విపక్షాలను రమ్మని సైతం పిలుస్తారు. కానీ, ఏపీ గవర్నర్ స్టయిలే వేరు.
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. మాత్రం మిన్ను విరిగి మీదపడుతున్నా కూడా మౌనంగా ఉంటు న్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షాలకు ఏం చెప్పుకోవాలన్నా.. దిక్కులేక.. ఇక చేసేది కూడా లేక.. ఆయనకే మొరపెట్టుకుంటున్నారు.
తాజాగా టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. వాటిని కట్టడి చేయాలని టీడీపీ కోరుతోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ సర్.. ఇప్పుడైనా పట్టించుకోండి.. అంటూ.. టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినతులు పంపిస్తుండడం గమనార్హం.
యువగళం.. పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్న ఆ పార్టీ నేతలు.. గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమా, వర్ల రామయ్య.. గవర్నర్ను కలవనున్నారు.
పోలీసుల ఆంక్షలు, మైక్ నియంత్రణ, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పాదయాత్రలో ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొని.. ప్రభుత్వానికి ఎప్పటిక ప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్యంపై పెరుగుతున్న వ్యతిరేకతపైనా నివేదిక రూపొందిస్తున్నట్లు.. సమాచారం. పాదయాత్రలో ఇంటిలిజెన్స్ ప్రమేయంపై యువగళం బృందం.. ఫోటోలు, వీడియోలు విడుదల చేయడం గమనార్హం.