యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్నటి వేళ ఓ సందేశం రాశారు. ఓ సందేహం తీర్చారు. దేశ రాజకీయాల్లో తన ఒరవడిని దిద్దింది వెంకయ్యే అన్న అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టు ఉంచారు. వాస్తవానికి ఈ మాట వందకు వంద శాతం నిజం. యంగ్ పార్లమెంటేరియన్ గా అక్కడికి వెళ్లినప్పుడు ఆయన్ను ఆదరించి,కొన్ని గైడ్ లైన్స్ చెప్పి పంపినవారిలో వెంకయ్య ఒకరు. రామూ నాన్న ఎర్రన్నతో ఉన్న సాహచర్యం కారణంగా వెంకయ్య ఈ పని చేసి ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కొత్త యువకులు ఎవ్వరయినా ఈ స్థాయికి రావడాన్ని ఆయన స్వాగతించి ఉండాలి. ఆ విధంగా మన యువ ఎంపీ రామూ అటు వెంకయ్యనూ ఇటు చిన్నమ్మ సుష్మానూ పెద్దాయన మోడీనీ ఏక కాలంలో ఇంప్రెస్ చేశారు. వాగ్ధాటి ఉంది. వెంకయ్య లాంటి అంత్య ప్రాసల పట్టింపు రామూకు లేదు. మంచి భాష ఉంది. ఉచ్ఛారణ దోషాలకు తావివ్వని హిందీ తెలుసు. ఇంగ్లీషు కూడా అంతే బాగా తెలుసు. తెలుగు మాతృభాష కనుక ఆయనకు భాషతో ఇబ్బంది లేదు. ఆయన భాషతో ఎవ్వరికీ ఏ ఇబ్బందీ లేదు. ఉండదు కూడా !
ఇప్పుడు దేశ రాజకీయాల్లో తెలుగువారి తరఫున మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాజకీయాలను దేశ రాజధానిలో నడిపిస్తున్నది పరుగులు తీయిస్తున్నది కేసీఆర్ మరియు కేకే. మరి ! ఆంధ్రా విషయానికే వస్తే కేవలం కొన్ని లాబీయింగ్ లకు మాత్రమే వైసీపీ ఎంపీలంతా పరిమితం అయిపోతున్నారన్నవిమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఆ విధంగా వాళ్లంతా పెద్దగా ప్రభావితం చేసిన లేదా చేస్తున్న దాఖలాలు లేవు. తెలంగాణ స్థాయిలో ఆంధ్రా అధికార పార్టీ నాయకులు అడిగింది లేదు.
అడిగి సాధించిందీ లేదు. కనుక ఇప్పుడు ఒకే ఒక్క ఆశ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు. వెంకయ్య తరువాత అంతటి స్థాయిలో మాట్లాడి పనిచేయించి మంచి ఫలితాలు అందుకోగల నేత ఆయనొక్కరే ! కనుక ఇప్పుడు ప్రత్యామ్నాయ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం ఎంపీ. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆంధ్రుల గొంతుక వినిపించిన యువ ఎంపీ ఇకపై కూడా అదే స్థాయిలో కేంద్రంపై పోరాడాల్సిన సందర్భాలు రానున్నాయి. వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దేశ రాజకీయాల్లో రాణిస్తే వెంకయ్య తరువాత అంతటి స్థాయి ఉన్న నేత రామూ కావడం ఖాయం.