నిప్పుతో చెలగాటం అస్సలు ఆడకూడదు. ఒకవేళ.. ఆడే ప్రయత్నం చేస్తే.. అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం అలవాటు. సమయం కలిసి వస్తే అంతా ఓకే. ఏ మాత్రం తేడా వచ్చినా చుక్కలు తప్పవు. లక్కీగా ఇప్పటివరకు ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఆయనకు అనుకూలంగా మారాయి. మరి.. ఇప్పుడు ఏం కాబోతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. తన మానాన తాను ఉన్న పీవీ కుమార్తెను తీసుకొచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపటం బాగానే కనిపిస్తున్నా.. దాని వెనుక పెద్ద డేంజర్ ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తనకు.. తన పార్టీకి ఎప్పుడూ అచ్చి రాని హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల్ని ప్రభావితం చేయాలన్న తపనే పీవీ కుమార్తెను అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పాలి. అయితే.. ఈ నిర్ణయంలో రిస్కు చాలా ఎక్కువన్న మాట టీఆర్ఎస్ నేతలే లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.
ఓడిపోయే సీటును పీవీ కుమార్తెను ఎంపిక చేయటం ద్వారా కేసీఆర్ వ్యూహం ప్రస్తుతానికి ఓకే అన్నట్లు అనిపించినా.. రేపు ఫలితం తేడా కొట్టిన తర్వాత ఆయన ఇమేజ్ భారీగా డ్యామేజ్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఓడిపోతారని తెలిసి కూడా పీవీ కుమార్తెను తెర మీదకు తీసుకొచ్చి.. పెద్ద మనిషి పరువు దెబ్బ తీసేలా చేశారే అన్న వ్యతిరేకత ప్రజల్లోనూ వస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది.
పీవీ మీద అంత ప్రేమే ఉంటే.. గౌరవంగా నామినేట్ చేయాలే కానీ.. ఇలా ఎన్నికల బరిలో దించటం సరికాదన్న మాట ఇప్పుడు అందరి నోట వస్తోంది. స్థానిక సంస్థల ద్వారా తన కుమార్తెను తేలిగ్గా ఎమ్మెల్సీగా గెలిపించుకున్న కేసీఆర్.. పీవీ కుమార్తెను అలా కాకుండా ఓటింగ్ ద్వారా ఎంపిక అయ్యేలా చేయటం సరికాదంటున్నారు.
ఇప్పటికే దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న కేసీఆర్.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేడా కొడితే.. మొదట ఇమేజ్ దెబ్బ తినేది కేసీఆర్ కే తప్పించి పీవీ కుమార్తెకు కాదన్నది మర్చిపోకూడదంటున్నారు. కీలక నిర్ణయాల విషయంలో కరెక్టుగా అంచనా వేసే అలవాటున్న కేసీఆర్.. ఇటీవల కాలంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్న అపవాదు ఉంది. అందుకు బలం చేకూరేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తె నిర్ణయం ఉందంటున్నారు. ఈ వాదనలో నిజం ఎంతన్నది కాలం తేల్చనుంది.