రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపించటం.. ఆ ఆరోపణల్ని ఆయనఖండించటమే కాదు.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లుగా తేల్చేశారు. అయితే.. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. విచారణ వరకు వచ్చింది. ఏసీబీ ఎంట్రీ తర్వాత తెర మీదకు ఈడీ కూడా రంగంలోకి దిగటం.. దీనికి తోడు ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. రేసింగ్ ఉదంతానికి సంబంధించిన కేసు పట్టుబిగుసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాలు డిసెంబరు 31న వాదనలు ముగించారు. ఈ రోజు తీర్పు వెలువరించారు. కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏసీబీ తరఫు ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని పేర్కొన్నారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించారన్నారు.
ఈ సందర్భంగా దర్యాప్తు ఏ దశలో ఉందని ఏజీని కోర్టు అడగ్గా.. ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలాన్ని సేకరించినట్లుగా కోర్టుకు తెలిపారు. నిందితులు అర్వింద్ కుమార్.. బీఎల్ ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? అని కోర్టు అడగ్గా.. ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని.. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.
దానకిశోర్ తరఫు సీనియర్ న్యాయవాది సీపీ మోహన రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక మంత్రి పర్యవేక్షణలో ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని.. రేసింగ్ కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించినట్లుగా కోర్టుకు చెప్పారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.
ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్థి పొందలేదని.. అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్ లో ఎక్కడా పేర్కొనలేదని వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో నిందితుడి చేర్చటం తగదన్న ఆయన.. ఈ సందర్భంగా పలు హైకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
అయితే.. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. ఆయన్ను విచారణతో పాటు.. అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన రేవంత్ సర్కార్…ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.