ఏపీలో గత అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అవమానించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా చంద్రబాబు సభను బాయ్ కాట్ చేయడం దుమారం రేపింది. అంతేకాదు, మళ్లీ సభలోకి ముఖ్యమంత్రి అయ్యాకే అడుగుపెడుతానంటూ చంద్రబాబు శపథం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు….పాత్రికేయుల సాక్షిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, భోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకోవడం టీడీపీ నేతలను, కార్యకర్తలను కలచివేసింది. తనతోపాటు తన భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోతోన్న అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హాజరు కావాలా..వద్దా అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా…వద్దా అన్న విషయంపై పార్టీ ముఖ్యనేతలతో బాబు సమావేశమయ్యారట. ప్రజాసమస్యలపై చర్చించేందుకు సమావేశాలకు వెళ్లి అధికార పార్టీని నిలదీయాలని చాలామంది సభ్యులు అభిప్రాయపడ్డారట. కానీ, సభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇవ్వరని, దీంతో, సభకు వెళ్లినా వైసీపీ సభ్యుల ముందు ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారట. అయితే, దాదాపుగా సమావేశాలను బహిష్కరించేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే, టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో ఏ విషయం అన్నది ఫైనల్ చేయబోతున్నారట.