ఏపీలో మరో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో, ఎన్నికలపై ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, పోటీ చేయడం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకుంటున్నారు.
అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ టీడీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాత నోటిఫికేషన్ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో, అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న సమావేశాన్ని టీడీపీ బాయ్ కాట్ చేసింది. టీడీపీతోపాటు బీజేపీ, జనసేన కూడా ఆ సమావేశాన్ని బహిష్కరించాయి.
ఎన్నికలపై ముందుగా చర్చించకుండానే ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించడంపై ఆ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాలతో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నాయి. ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.