గడిచిన రెండు వారాలుగా ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. అనూహ్యమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం.. టీడీపీ నేతలు జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నాయకులు మీడియా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల్లో.. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. సమర్థులైన నాయకులు కూడా ఓడిపోయారు. దీంతో వారంతా కూడా సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా.. వారు పెద్దగా రియాక్ట్ కాలేదు. దీంతో కిం కర్తవ్యం అంటూ.. చంద్రబాబు తలపట్టుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కమిటీలు వేశారు.
ఎన్నడూ లేని కొత్త పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌ల కమిటీలను ఏర్పాటు చేశారు. జంబో పార్లమెంటు కమిటీలను కూడా ఇటీవల ఏర్పాటు చేశారు. యువతకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. బీసీ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడా ఆశించిన మేరకు టీడీపీలో జోష్ కనిపించలేదు. కానీ, అనూహ్యంగా గడిచిన రెండు వారాలుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ సీనియర్లు మీడియా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంపైనా.. స్థానిక నేతలపైనాతీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అంతేకాదు, నియోజక వర్గాల్లో తిరుగుతున్నారు. ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా మారిపో యిన పరిస్థితి వెనుక ఏముందనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏప్రిల్ తర్వాత.. ఎప్పుడైనా రాష్ట్రంలో ఎన్నికలు రావొచ్చనేది త్ముమ్ముళ్ల దూకుడుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంజమిలికి సై అంది. దీంతో చంద్రబాబు వెంటనే టీడీపీ నేతలను అలెర్టు చేశారు. అయితే.. ఆదిలో జమిలిపై తమ్ముళ్లు లైట్ తీసుకున్నారు. ఆ.. ఎప్పుడూ అనేదే కదా.. అనుకున్నారు. కానీ, దీనికి సంబంధించిన ప్రక్రియను మోడీ సర్కారు వేగవంతం చేసిందని ఢిల్లీ వర్గాల నుంచి సంకేతాలు అందడం, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ జమిలికి అధికార పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు.. వచ్చే ఏడాది ఒకవేళ ఎన్నికలు జరిగితే.. వైసీపీని ఓడించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారని, ఈ క్రమంలోనే వారు జోరు పెంచారని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ దూకుడు జమిలి వరకేనా.. లేదా.. మున్ముందు కొనసాగుతుందా? చూడాలి.