వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్టు కావచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి..అయితే, తన తల్లి అనారోగ్యం కారణంగా తాను ఈనెల 27 వరకు విచారణకు హాజరు కాలేనని సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాయడం సంచలనం రేపింది. ఇక, అప్పటివరకు తనను అరెస్టు చేయవద్దంటూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
అక్కడ ఆయనకు చుక్కెదురు కావడం తెలిసిందే. తన ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలంటూ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అండర్ స్టాండింగ్ ఉందని, వాటి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని చింతమనేని ఆరోపించారు. ఆ ఒప్పందంలో భాగంగానే అవినాష్ రెడ్డి ఇంకా అరెస్టు కాలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమన్వయ ధోరణి వల్లే అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ కఠిన వైఖరిని అవలంబించడం లేదని చింతమనేని ఆరోపించారు. ఎన్నిసార్లు విచారణ చేసిన తర్వాత కూడా సీబీఐ అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటని చింతమనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఏలూరు విద్యుత్ భవన్ దగ్గర చింతమనేని ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం తగ్గించాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.