ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని, జనం కోసం జగన్ పరితపించిపోతున్నారని బుగ్గన అసెంబ్లీలో ఊదరగొట్టారు. ప్రజలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించామంటూ డబ్బా కొట్టారు. ఈ సందర్భంగా బుగ్గన ప్రసంగానికి టీడీపీ నాయకులు అడ్డుతగిలారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
బుగ్గన ప్రకటిస్తున్న అంకెలను టీడీపీ నేతలు తప్పుబడుతూ నినాదాలు చేశారు. బడ్జెట్ అంతా తప్పుల తడక అని, తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ తమ్మినేని వారించే ప్రయత్నం చేసినా…టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రసంగానికి ఆటంకం కలిగించవద్దని, ఇది సాంప్రదాయం కాదని చెప్పబోయిన స్పీకర్ మాటలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు.
ఇక, టీడీపీ నేతలకు బడ్జెట్ పై శ్రద్ధ లేకపోతే వెళ్లిపోవాలంటూ బుగ్గన అవమానకరరీతిలో మాట్లాడారు. అయితే, బుగ్గనకు దీటుగా టీడీపీ సభ్యులు శాంతించకుండా వాదనలు కొనసాగించారు. ఇక, ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అంకెల గారడీ చేస్తూ గత రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, ఈ బడ్జెట్ కూడా అంతేనని మండిపడ్డారు. ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెట్టేస్లే రాష్ట్రంలో ఏం మిగులుతుందని గోరంట్ల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని గోరంట్ల డిమాండ్ చేశారు.