షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందన్న మాట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. నిజంగానే ముందస్తుకు వెళతారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రానప్పటికీ.. ఇప్పటివరకు ఉన్న వాతావరణం చూస్తే ఆ అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే.. అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇంతకాలం మౌనంగా ఉన్న రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖకు చెందిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లోకేశ్ తో భేటీ కావటం తెలిసిందే. ఇలా ఇంతకాలం రాజకీయాల్లో యాక్టివ్ గా లేని నేతలు ఒక్కొక్కరు తమ వనవాసాన్ని ముగిస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి కడపలో చోటు చేసుకుంది.
ఇటీవల కాలం వరకు మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను.. తనతో పాటు మరికొందరు సీనియర్లు టీడీపీలో చేరనున్నట్లు చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని తేల్చేయటం గమనార్హం. వీరశివారెడ్డితో పలువురు సీనియర్లు టీడీపీలో చేరే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే వీరశివారెడ్డి మాట్లాడుతూ.. తనతో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి.. వరదరాజులు రెడ్డి.. హరినారాయణ రెడ్డితో సహా అంంతా జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
2019లో జరిగిన ఎన్నికల వేళలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడిగిన మాటకు కడప జిల్లా ప్రజలతో పాటు ఏపీ మొత్తం కలిసి జగన్ కు 151 సీట్లు ఇస్తే.. 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని పాలనను జగన్ చేస్తున్నారన్నారు. సెక్రటేరియట్ ముఖం చూడని జగన్.. పాలన చేయటం లేదన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు పది సీట్లకు పది సీట్లు వైసీపీకి కట్టబెట్టారని..ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు.
తాను ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ లను కలిశానని.. తనతో పాటు డీఎల్ కూడా చంద్రబాబుకు టచ్ లో ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు ఓకే చెబితే కమలాపురం నుంచి పోటీ చేస్తానని.. నియోజకవర్గంలోని ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. మొన్నటి వరకు తమను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు చెప్పినా.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ప్రకటన చేయటం గమనార్హం.