టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్య వాణి రాజీనామా ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన సంగతి తెలిసిందే. ముందుగా మహానాడులో తనకు అవమానం జరిగిందని, తనకు మాట్లాడే అవకాశమివ్వలేదని దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసి…ఆ తర్వాత డిలీట్ చేశారు. ఆ తర్వాత దివ్యవాణితో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ తర్వాత దివ్యవాణి మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే, ఈ వ్యవహారంపై దివ్యవాణి అధికారికంగా స్పందించలేదు. దీంతో, ఆమె రాజీనామాపై సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ సస్పెన్స్ కు తెరదించుతూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. తన రాజీనామాపై స్వయంగా దివ్యవాణి ఓ వీడియోను విడుదల చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన టీడీపీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన దివ్యవాణి…పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.
ఏడాదిగా తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారని, పార్టీలో తన స్థానం ఏంటో తెలియని పరిస్థితి అని అన్నారు. ఆఫీస్లో ప్రెస్మీట్లు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తమ పార్టీ నేతల చుట్టూ తిరిగినా కనీసం స్పందన లేదని, ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ప్రజలకు చంద్రబాబు మంచి చేస్తారనే టీడీపీలో చేరానని మాట్లాడుతూ దివ్యవాణి తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కొందరు ఫోన్ చేసి చెప్పారని, అందుకే తానే రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ పెట్టానని అన్నారు. కొందరు కావాలనే తనపై ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని దివ్యవాణి ఆరోపించారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పేందుకు ప్రయత్నిస్తే…అపాయింట్ మెంట్ రాకుండా అడ్డుకున్నారని అన్నారు. నాలుగు గంటలు వెయిట్ చేశాక చంద్రబాబుతో మాట్లాడించారని అన్నారు.
‘చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు.. ఇప్పుడే కాదు.. ఈ మాట ఎప్పుడైనా ఇదే చెబుతాను. నేను ఎప్పుడూ భజన చేయను. ఎవరూ చెప్పని నిజాలు చెబుతున్నానని అందరూ ప్రశంసించారు. చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే వచ్చి వెళుతున్నారు. నేను కూడా హైదరాబాద్ నుంచే వచ్చి వెళుతున్నాను. ఎవరితో మీడియా మీట్ నిర్వహించి మాట్లాడించాలో ముందే అనుకుని మాట్లాడిస్తారు. నేను చెప్పాల్సిన అంశాలను ఇతర నేతలతో చెప్పించారు. అధినేతను కొందరు రాంగ్ రూట్లోకి తీసుకెళుతున్నారు. చంద్రబాబును ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను’ అని దివ్యవాణి అన్నారు.
అయితే, దివ్యవాణి త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకోబోతోందని తెలుస్తోంది.