ఎన్నికల ముందు టీడీపీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. రెండు ప్రధాన విషయాల్లో టీడీపీకి స్పష్టమైన క్లారిటీ కనిపిస్తోంది. ఒకటి పార్టీలో నేతల జంపింగులు లేనట్టే!. రెండు.. ప్రచారం విషయంలో ప్రశాంతంగా ముందుకు సాగడం. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఏ పార్టీకి అయినా.. జంపింగుల బెడద ఉంటుంది. ఇటు వారు అటు.. అటు వారు ఇటు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు.
గత 2019 ఎన్నికల సమయంలో టికెట్ ను కన్ఫర్మ్ చేసుకుని మరీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి వంటి వారు జంప్ చేశారు. అదేసమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా పార్టీ కీలకమైన ఎన్నికల సమయంలో అంతర్మథనంలో పడినట్టయింది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. టీడీపీ నుంచి జంప్ చేయాలని అనుకునేవారికి మరో ప్రత్యామ్నాయం వైసీపీ. అయితే.. ఇప్పుడు ఈ పార్టీలోనే లెక్కకు మించిన నాయకులు ఉన్నారు.
ఇక, వైసీపీ నుంచి వచ్చేవారే తప్ప.. వెళ్లి ఆ పార్టీ కండువా కప్పుకోవాలని అనుకునేవారు కనిపించడం లేదు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా టీడీపీని సేఫ్ జోన్లోనే ఉంచింది. ఒకవేళ టికెట్ దక్కక అసంతృప్తి వ్యక్తం చేసే నాయకులకు కూడా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రేపు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నా.. ఆ పార్టీపై లెక్కకు మించిన ఆశలైతే ఎవరికీ లేవు.దీంతో అటు వైపు టీడీపీలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నప్పటికీ వెళ్లే పరిస్థితి లేదు.
సో.. మొత్తానికి జంపింగుల విషయంలో టీడీపీ సేఫ్ జోన్లోనే ఉందని అంటున్నారు. ఇక, రెండో కీలక విషయం ప్రచారం. ఇది కూడా టీడీపీకి కలిసివచ్చే అవకాశంగానే ఉంది. ముఖ్యంగా అభివృద్ధి, చంద్రబాబు విజన్ వంటివి టీడీపీకి ఎంతో కలిసి వస్తున్నాయి. దీంతో ఇతర విషయాలను పక్కన పెట్టి.. ఈ రెండు కోణాల్లోనూ చూసుకుంటే పట్టణ, నగర నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారనే అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా వైసీపీ ఎఫెక్ట్ కారణంగా గత ఎన్నికల్లో నష్టపోయిన టీడీపీ.. ఇప్పుడు అదే ఎఫెక్టతో లాభపడుతోందని అంటున్నారు.