వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలచే పొలిటీషియన్స్ లో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకరు. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. చంపుతా అంటూ కొందరు మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టిన గుమ్మునూరు జయరాం.. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఏపీ కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధిష్టానం మంత్రిగా ఉన్న జయరామ్ కు కర్నూలు పార్లమెంటు ఇవ్వడంతో.. అధిష్టానం నిర్ణయం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీని వీడారు. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం, గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగాయి. తాజాగా గుంతకల్లు పట్టణ శివారులోని దోనిముక్కలలో పర్యటించిన జయరాం.. అక్కడ ఉన్న లేఔట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యల గురించి ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జయరాం ఒక్కసారిగా శివాలెత్తారు. కొందరు మీడియా ప్రతినిధులు డబ్బులు తీసుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని.. వాటిని నిరూపించే దమ్ము ఉంటేనే రాయాలని జయరాం ఫైర్ అయ్యారు. తనపై లేనిపోనివి రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీడియా అంటే తనకు లెక్కలేదని.. తాను అన్నీ చేసి వచ్చినవాడినని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో అంటూ రుసరుసలాడారు.
భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ ఇష్టమొచ్చనట్లు రాస్తున్నారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా అంటూ జయరాం హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికార పార్టీలో ఉండి చంపుతా అంటూ మీడియాపై జయరాం విరుచుకుపడటం కూటమి ప్రభుత్వానికి తలవొంపులు తీసుకొచ్చే విధంగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.