ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు.. అజేయ కల్లం రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎంజగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. తాజాగా అజేయ కల్లం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. హత్య జరిగిన రోజు తెల్లవారు జామున ఏం జరిగిందనే విషయం కల్లం రెడ్డి తెలుసునని.. అయితే.. ఆయన సీఎం జగన్కు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.
‘‘మీలాంటి వారి వల్లే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. అమరావతి `కమరావతి` అని విషం చిమ్మిన ఆ నలుగురిలో ఒకరు బయటికి వచ్చారు! కుల పిచ్చితో జగన్ రెడ్డి పక్కన చేరాడు. అజేయ్ కల్లం రెడ్డి సీబీఐ నిన్న వచ్చి అడిగితే టైం తెలియదు చూసుకోలేదు అని చెబుతున్నావు. నీలాంటి కుల పిచ్చి ఉన్న తప్పుడు అధికారుల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే వారిని బొక్కలో వేయాలి!.. టైం తెలియని వాళ్లు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎందుకు?“ అని దేవినేని నిప్పులు చెరిగారు.
సీబీఐ ముందు చేతులు కట్టుకొని నిల్చున్నారు కదా అని ఎద్దేవా చేశారు. మీలాంటి వెన్నుముక లేని ఆఫీసర్లు, కుల పిచ్చి ఉన్న అధికారులు అవినీతిలో భాగస్వాములై జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రెస్మీట్ పెడతావా? అని ప్రశ్నించారు. నీకు టైం తెలియదా? కళ్ళు దొబ్బాయా?.. ఆరోజు జగన్ రెడ్డి తెల్లవారు జామున వచ్చి చెప్పాడు అని తెలిసిన వాడివి నాలుగేళ్లుగా ఎందుకు చెప్పకుండా కూర్చున్నావు? అని ప్రశ్నించారు.
విజయవాడలో క్షుద్ర పూజలు చేసింది ఎవరని దేవినేని సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు?. నాలుగు కోట్లు పంచుకుంది ఎవరు? నరబలులు ఎవరు చేయమన్నారు? అని నిలదీశారు. సీబీఐ వాళ్ళు వచ్చేవరకు సమాధానం చెప్పలేదు ముందు నీలాంటి వాళ్ళని సీబీఐ వాళ్ళు బొక్కలో వేయాలి! అంటూ దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.