2024 ఎన్నికల్లో కీలక పాత్ర ఎవరిదో తెలుసా ? ఇపుడీ ప్రశ్న జాతీయ రాజకీయాల్లో చాలా జోరుగా జరుగుతోంది. దీనికి సమాధానంగా మంగళవారం ఢిల్లీలో కీలకమైన పరిణామం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. వీళ్ళ ముగ్గురి మధ్య సుదీర్ఘమైన సమావేశం జరిగింది. ఇద్దరితో పీకే భేటీ కావటం బహుశా ఇదే మొదటిసారేమో ఈ ఏడాదిలో.
వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల విషయంపైన కూడా చర్చలు జరిగాయి. నరేంద్రమోడి నేతృత్వంలోని ఎన్డీయేని ఓడించాలంటే ప్రత్యర్ధి కూడా బలంగా ఉండాల్సిందే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఇఫ్పటివరకు ఎన్డీయే, యూపీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటుకాలేదు. మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా చాలాపార్టీలు కలసి రావటంలేదు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ లేకుండా ఎన్డీయేని ఓడించటం సాధ్యంకాదు. ప్రతిపక్షాల్లో ఎంత ఐకమత్యం ఉంటే ఎన్డీయేని అంత సమర్ధవంతంగా ఎదుర్కోగలరని పీకే పవార్, మమతతో చెప్పినట్లు సమాచారం. పీకే వాదనలో నిజం ఉంది కాబట్టే వారు కూడా కాంగ్రెస్ తో కలవటానికి అంగీకరించారట. పవార్, మమత, తేజస్వి అభిప్రాయాలను, ఆలోచనలనే పీకే రాహూల్, ప్రియాంకలతో పంచుకున్నారు.
పీకే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 137 సీట్లలో గెలవాలి. మిగిలిన పార్టీలు 136 సీట్లలో గెలవాలి. అప్పుడు అధికారంలోకి రావటానికి అవసరమైన మినిమం సీట్లు వస్తాయి. ఇది జరగాలంటే ఎన్నికలకు ముందుకానీ తర్వాత కానీ కచ్చితమైన అవగాహనతో ఒప్పందం జరగాలి. ఆ అవగాహన, ఒప్పందమేదో ఇప్పటినుండే కార్యాచరణ మొదలవ్వాలని పీకే చెప్పినట్లు సమాచారం. కాబట్టి ఏ రీతిలో చూసుకున్న 2024 ఎన్నికల్లో పీకేనే అత్యంత కీలకమైన వ్యక్తిగా ప్రచారం మొదలైంది.