ప్రఖ్యాత తెలుగు సంస్థ ‘తానా’ లో మరింతగా ప్రతిష్ట కలిగిన ‘తానా’ ఫౌండేషన్ నాయకత్వములో ఫక్తు దేశీయ రాజకీయ ఫక్కిలో, సంస్థ మీద మొత్తంగా ఆధిపత్య కాంక్షతో ఆయారాం గయారాం పంథాను అనుసరిస్తూ, పోటాపోటీగా నడచిన గ్రూప్ రాజకీయాల్లో నాయకత్వ తిరుగుబాటు మీటింగ్ జరిగింది. అది ‘తానా’ సంస్థ చట్టప్రకారం జరిగిందా లేదా అనే విషయంలో సందేహం గట్టిగా ఉండగానే, ఈ పద్ధతి కరెక్ట్ కాదేమో అనే విషయం సీనియర్ నాయకులు అంటుండగా, ఆదరాబాదరాగా ఉన్న నాయకత్వాన్ని పడగొట్టడం, కొత్త నాయకత్వాన్ని టర్మ్ మధ్య లో ఎన్నుకోవడం, ఆ విషయం అత్యున్నత ‘తానా’ బోర్డునకు ఇరువర్గాలు వివరించడం, ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ సహకారం పొందడం కూడా మొదలు కావడం, అంతలోనే మిన్ను విరిగి మీద పడ్డట్టు గా, ‘తానా’ వెబ్ పేజీ లో ఫోటోలు మార్చుకోవడం,’తానా’ బోర్డులో ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడం, అందరూ కలిసి రెట్టింపు చేసిన సభ్యత్వాలకు ఓటు హక్కు పై థ్రిల్లర్ సీరియల్ సాగుతుండగా, ఇప్పటివరకు ఉప్పు నిప్పులా ఉండే రెండు వర్గాలు రాజకీయ కారణాలతో అనువుగాని సమయంలో, ప్రదేశంలో తరువాతి ‘తానా’ కన్వెన్షన్ జరపాలనుకోవడం, మూడు గ్రూపులు రెండు గ్రూపులుగా రూపాంతరం చెందడం, ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూపునకు పిల్లి మొగ్గలు, పరిపాలన పరంగా ఇంకా అనేక అపరిపక్వ విన్యాసాలు ‘పరమానందయ్య శిష్యుల’ చేష్టలను మరిపించక మానవు.
ఈ జరుగుతున్న విషయాల్లో ఎక్కడైనా ‘తానా’ సంస్థ మీద గాని, దాని సేవా దృక్పథంలో గాని ఏ నాయకునించి అయినా ఎక్కడైనా కమిట్మెంటు కనపడితే కొరడాతో కొట్టుకోవచ్చు. ఒక సంస్థ (చారిటీ, రాజకీయ పార్టీ, స్కూల్ వగైరా) గొప్పదనం దాని చరిత్ర తో కొంత, దానిని ప్రస్తుతం నడుపుతున్న నాయకత్వంలో కొంత కలగలిసి ఉంటాయి. రెండూ ఒకదానికొకటి పోటీపడినంత కాలం ఉచ్చస్థితి లోకి దూసుదూసుకెళ్తాయి. అటువంటి కోవలోనే మన తెలుగు వారందరికీ తలమానికమైన అందరి ఆదరాభిమానాలతో ఇప్పటివరకు గొప్పగా గౌరవించబడుతున్న’తానా’ అన్ని తెలుగు సంస్థలలో కెల్లా మేటి అనిపించుకున్నది.
పెద్దల నాయకత్వంతో 40 సంవత్సరాలుగా అలరారిన ‘తానా’ గత దశాబ్దంలో వర్గాల ఆధిపత్య పోరాటంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ముందుగా అధిష్టానం అనేది ఒకటి ఏర్పడి కొన్నేళ్లు అధికారం చలాయించి తమ వంది మాగధులనుకునే వారిని అర్హతలెటువంటివైనా అందలమెక్కించుతూ అధికార దాహార్తులకు నెలవుగా సంస్థను మార్చారు. క్రమంగా అంతర్గత విభేదాలు ఏర్పడుతూ చివరికి గత ఎన్నికలలో వారి నీడనే పెరిగిన వారు వెన్నుపోటు పోడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇంతవరకూ జరిగిన చరిత్ర అటూ ఇటుగా సాధారణంగానే అనిపిస్తూ ‘తానా’ కు మళ్ళీ ఉచ్చ దశ మొదలువుతుందేమో అని ఎక్కువ మంది ఆశిస్తుండగా అందుకు విరుద్ధంగా అసలు రచ్చ ఇప్పుడే మొదలయ్యింది. నాయకుల అహంకారంతో కూడిన ఆధిపత్య ధోరణి కి అనుభవలేమి తోడై గమ్యం లేకుండా సిగపట్ల ప్రతాపాలతో కాలం గడుపుతున్నారు.
ప్రస్తుతం బోర్డు, ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ వంటి అన్ని ‘తానా’ కార్యవర్గాల్లో అత్యంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. నాయకుల మధ్య ఐక్యత నేతి బీరకాయలో నెయ్యి మాదిరి, ఏహ్యత అక్షయపాత్రలో అన్నమంత, ఒకరి కాళ్ళు ఒకరు లాగడం, ఒకరి వీపు మరొకరు పోటు పొడవడం, ఎవరి కళ్ళు వారు మూసుకోవడం అనేది రోజువారీ కార్యక్రమమే అయ్యింది. మెల్లగా ఆధిపత్యం కోసం మొదలైన వీరి ఆరాటం క్రమక్రమంగా పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టుకుంటా అన్నట్లుగా తయారయ్యింది. ఇక గత కొన్ని రోజులుగా త్వరితగతిన జరుగుతున్న దిగజారిన రాజకీయ చేష్టలు, అనాలోచిత మరియు అర్ధంలేని వ్యవహారాలను చూస్థున్న అనేకులు ‘పరమానందయ్య శిష్యుల కధలు’ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు.
అసలే గొప్ప పేరున్న ‘తానా’ సంస్థలో అంతకు మించి గౌరవ మర్యాదలు పొందే సేవా విభాగమైన ‘తానా ఫౌండేషన్’ నాయకత్వ విభాగంలో జరిగిన తిరుగుబాటు ఎన్నికల ప్రహసనం ఇటివంటి పోలికలు కు కారణం కావచ్చు. మూడున్నర మిలియన్ స్వంత డబ్బు ఖర్చుతో ఒకప్పటి మూడు వర్గాలు (ప్రస్తుతం రెండు వర్గాలు) జనవరి నెలలో చేర్చిన 35 వేల మంది సభ్యులకు ఓటు హక్కు విషయంగా మొదలైన రాజ్యాంగ సంక్షోభ విషయం కేంద్రంగా, అనేక దిగజారిన రాజకీయాలకు కారణభూతమవుతూంది. ఇప్పుడు అధికారంలో ఉన్న అట్లాంటా బ్రదర్స్ పాత అధిష్టానవర్గం తో కలగలసిపోయి, ఇంకా చెప్పాలంటే పాత అధిష్టాన పెద్దలకు బలవంతపు రిటైర్మెంటు ఇచ్చి గ్రూప్ వ్యవహారాలను కబ్జా చేసి మిగిలిన జయ్ వర్గాన్ని కూడా కూలదోసే ప్లాన్ ను అమలు చేస్తున్నట్లు గా తెలుస్తోంది. కానీ దానికి దీటుగా ఎదుర్కోవడంలో జయ్ వర్గం కనీవినీ ఎరుగని రీతిలో నిలబడటమే గాకుండా, తాము చేసే పోరాటానికి ‘తానా’ రాజ్యాంగపరంగా కూడా కలిసి రావడంతో, గత అధిష్టానం పై చాలా మందికి ఉన్న వ్యతిరేకత మూలంగానూ, వర్గ పోరాటంలో పై చేయిలోనే ఉంది.
ఈ పరిస్థితి లోని తరువాతి అంకంలో కొత్తగా చేరిన సభ్యుల ఓటు హక్కు కీలకమైన తరుణంలో, ప్రస్తుత ‘తానా’ రాజ్యాంగ పరంగా వాటి హక్కు ఇవ్వలేని పరిస్థితిలో బై-లాస్ మార్చడానికి బోర్డులో జరిగిన చర్చలో విషయం వీగిపోవడంతో బ్రదర్స్ వర్గం నీరు కారిపోయింది. ఇక అందుకు బోర్డు మెజారిటీ మొగ్గుకు కారణభూతమైన ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ, కోశాధికారి శ్రీకాంత్ ల పై కత్తి గట్టి 14 మంది ఫౌండేషన్ సభ్యులు సగం సగంగా చీలిన పరిస్థితిలో, ప్రెసిడెంట్ కు ఉన్న ఒక్క ఓటును కూడా కలిపి బొటాబొటీ మెజారిటీ తో ఫౌండేషన్ కార్యవర్గాన్ని కూలదోసి తమ వర్గం ఎన్నికయినట్లు ప్రకటించి బోర్డునకు కూడా వివరించి కొత్త రకం రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇటువంటి వ్యవహారాలు ‘తానా’ బై-లాల పరంగా ఎక్కడ ఉండకపోవడంతో ఈ సమావేశం చెల్లదని, ప్రస్తుత కార్యవర్గమే కొనసాగుతుందని, ఇంకా అవసరమైతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగానే ఉన్నామని వెంకట రమణ వర్గం బలంగా చెప్పడంతో మొత్తం ‘తానా’ నాయకత్వం సంక్షోభంలో పడ్డట్టే. దానికి తోడు ప్రెసిడెంట్ లావు వర్గం ఆదరాబాదరాగా పాత ఫౌండేషన్ నాయకుల పేర్లు ఫోటోలు వెబ్సైట్ లో తీసేసి కొత్త పేర్లు, ఫోటోలు పెట్టడం పుండు మీద కారం జల్లినట్టు అయి వైషమ్యాలను తారాస్థాయిలోకి చేరటంతో, ఇంకా ఎటువంటి పరిణామాలను చూడవలసి వస్తుందేమోనని ‘తానా’ సంస్థ బాగును కోరుతున్న తెలుగు సమాజం భయపడుతోంది.
https://namasteandhra.com/tana-mudu-mukkalaata-3-atlanta-in-confusion-mode/
TANA – మూడు ముక్కలాట లో ‘ఆల్ ఇన్’ గ్యాంబ్లింగ్ చేస్తున్న’తానా’ లోని మూడు వర్గాలు!