‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం. ‘తానా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ దేశవ్యాప్తంగా అనుచరులు అనేక వాద్యాలతో తమదైన గాత్రం చేస్తూ ‘జుగల్బందీ’ తో చూపరులకు వినోదం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ‘నరేన్ కొడాలి’, ‘నిరంజన్ శృంగవరపు’ మరియు ‘శ్రీనివాస గోగినేని’ వర్గాలు తమ బలగాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ నే మరింత బలాన్ని సమీకరించే పనిలో బిజీగా ఉంటూ…వేరే వర్గాలపై నిఘా కన్నేసి ఉంచారు. అయితే ఓటర్లు కూడా తమ అసలు మద్దతు ఎవరికో చెప్పకుండా పైకి మాత్రం ఒకరి కంటే ఎక్కువ మందికి తమ మద్దతూ తెలియజేస్తూ ఆటా పాటను మరింత రక్తి కట్టిస్తున్నారు.ఇప్పటివరకు పోటీ వాతావరణం సరిచేయడంలో విఫలమవుతున్న స్వయంప్రకటిత అధిష్టానం, దీనికంతటికీ కారణం ‘గోగినేని’ పోటీ లోకి దూసుకురావటం అని మదన పడిపోతున్నట్లు సమాచారం.
తాజాగా బే ఏరియాలో తాము ఇచ్చిన ఉగ్గు పాలతో పాటు అన్నప్రాసన కూడా చేసిన ఒక గల్లీ లెవెల్ యువకుడు వేరే వర్గంలోకి ఫిరాయించడమే కాకుండా మొత్తం ‘అశోక’చక్రం తిప్పుతున్నట్లు భావించుకోవడం, పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా బాధ పెడుతున్నట్టు సమాచారం. దానికి తోడు బే ఏరియాలో ఒక స్థాయి, కొంత పరపతి కలిగిన ఇంకో నాయకుడు కూడా సిద్ధాంత పరంగా కలసి పని చేయలేనని తెలియచేయడం దేనికి సంకేతమో, ఏ విపరీతానికి దారి తీస్తుందో అధిష్టానానికి అర్ధం కాని విషయము.
వివిధ వర్గాలకు చెందిన అనేక మందితో చర్చించిన తరువాత మూడు వర్గాల పరిస్థితి ప్రస్తుతం క్రింది విధం గా ఉన్నట్లు తెలుస్తోంది.
‘నరేన్ కోడాలి’: తాజాగా ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా వేళ్లూనుకున్న వ్యవస్థ తోడుగా ఉండటం, ముఖ్యంగా ఎప్పుడూ మందితో కలివిడిగావుండే ‘సతీష్ వేమన’ అండ వరాల కొండ అని విశ్వాసం, ధైర్యం కలిగిస్తోంది. ఈ బలానికి తోడు, తాను కూడా చాలా ఏళ్లుగా ఏర్పరచుకొన్న పరిచయాలు అక్కరకు వస్తాయని నమ్మకం. క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్నప్పటికీ కొద్ధి కొద్దిగా, క్రమ క్రమంగా పట్టు జారుతున్నట్లు వస్తున్న సూచనలు ఎక్కడిదాకా తీసుకు వెళ్తుందోనని ఆందోళన. గల్లీ యువకుడు’అశోక’చక్రం తిప్పుతున్న ఓవర్ ఏక్షన్ ఏవగింపు కలిగిస్తూండగా, విభేదిస్తున్న మరో ముఖ్య నాయకున్ని,తమతోనే ఉంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.అందరికంటే ముందుగా ప్యానెల్ పూర్తి చేసి ముఖ్యులను తమతో కట్టిపడవేసే వ్యూహం మంచా చెడా అనేది తెలియడంలేదు.
వచ్చే వారం పాటు సెలవుల సందర్భంగా ‘నరేన్ ‘పాడుకుంటున్న పాట:
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు,చూడ చూడ రుచుల జాడ వేరయా, పురుషులందు ‘పుణ్య’ పురుషులు వేరయా విశ్వధాభి రామ వినుర ‘వేమనా’!
‘నిరంజన్ శృంగవరపు’: చాలా ముందునుంచి రంగంలో ఉన్నానని, పదవికి తగినట్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుత నాయకత్వంలో ఉండటం కలిసి వస్తుందని గట్టి నమ్మకం. కానీ గ్రామాల్లో కనిపించే మోతుబరి వ్యవస్థ లాంటి బలాన్ని ఎక్కువగా ఊహించుకొంటూ , గల్లీ యువకుడు తిప్పుతున్న’అశోక’చక్రం మ్యాజిక్కులు చేస్తుందని గుడ్డిగా నమ్మవద్దని సన్నిహితులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పదవి లో చేస్తున్నసేవలు దరిజేర్చవచ్చని నమ్ముకమున్నా,అదే విషయంలో ప్రత్యర్ది ‘గోగినేని’ సేవలు ఇంకా ఎవరూ మర్చిపోలేదని బెంగ, వెరసి చెప్పుకోవటానికి ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఖచ్చితమైన మెజారిటీకి గ్యారంటీ లేదన్న వాస్తవం ఇంకా బలపడాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.ఇక బే ఏరియా లో ‘నరేన్’ వర్గం నుంచి తప్పుకుంటానికి ప్రయత్నిస్తున్న నాయకుడు తమదాకా వస్తాడా, అక్కడే ఉంటాడా, ఇంకెక్కడికైనా పోతాడా, అసలు పోటీ చేయను పొమ్మంటాడా అనేది పెద్ద పశ్నగా మిగిలింది. పోటీ లో ఉన్న అందరిలోకి ‘జూనియర్ ‘అన్న విషయము ఇబ్బంది పెడుతున్నా ప్రస్తుత నాయకత్వం అండ కొంత కవర్ చేయవచ్చని ఆశ.
ఇక ‘నిరంజన్ ‘సెలవుల సందర్భంగా పాడు కుంటున్న పాట:
‘జయ శేఖరా’, నీ పై మోజు తీరలేదురా, ‘రాజా’సాన ఏలరా! ‘జయశేఖరా’నీ పై మోజు తీరలేదురా, మనసు నిలువ నీదురా, మమత మాసి పోదురా!
‘శ్రీనివాస గోగినేని’: ధృడమైన మనస్తత్వంతో, మొండి ధైర్యం తో మొదలుపెట్టి ‘మన ఊరి కోసం ‘నినాదంతో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గా గతంలో చేపట్టిన అనేక కార్యక్రమాల విజయ స్ఫూర్తితో మొదలైన ప్రయాణం, ప్రస్తుతం త్రిముఖ పోటీ దాదాపు ఖాయం అయిన కారణంగా , ప్రత్యర్థులకు ధీటుగా నిలబడగలగడం అమెరికా వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. వ్యక్తిగత ఇమేజీ తో పాటుగా ‘గాడ్ ఫాదర్ ‘వ్యవస్థ వ్యతిరేకిగాను ఉన్న గుర్తింపు కారణంగా స్వచ్చందంగా 30-35 శాతం పైగా ఓట్లు వచ్చే అవకాశం, త్రిముఖ పోటీలో విజయావకాశాలకు దగ్గర చేసింది. కానీ ‘తానా’ వ్యవస్థలో సేవల విషయాన్ని, అర్హతలను పట్టించుకోకుండా, తమ నాయకుల్ని గుడ్డిగా అనుసరించి వారు చెప్పినవారి కోసం ఓటింగ్ లో పాల్గొని గెలిపించే చరిత్ర ఎక్కువగా ఉండటం ఆందోళనకరమే.అయితే అదే గుడ్డి వ్యవస్థపై సామాన్య సభ్యుల్లో ఉన్న ఏహ్యభావం, త్రిముఖ పోటీ మూలంగా గుడ్డి వ్యవస్థ బలంలోని నిట్టనిలువు చీలిక కారణంగా ‘గోగినేని’ బలంగా మారుతున్నట్లు, రోజు రోజుకీ మద్దతు పెరుగుతున్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ కనీసం రెండో స్థానం గ్యారంటీ తో జాతీయ స్థాయిలో మొదటి స్థానానికి ముఖ్య పోటీదారు గా ఉన్నట్లే అందరూ వేస్తున్నలెక్క.
ఈ సెలవుల సందర్భంగా ‘గోగినేని’ పాడుకుంటున్న పాట :
‘కృషి ఉంటె మనుషులు ఋషులవుతారూ, మహా పురుషులవుతారూ-తర తరాలకూ తరగని వెలుగవుతారూ, ఇలవేలుపులవుతారూ’
పైన చర్చించిన పోటాపోటీ వాతావరణం సుమారు 40 దాకా ఉన్న మిగతా పదవులు ఆశించే పోటీదారులకు మరింత ఆందోళన కలిగిస్తూ, రక్తపోటు, ఎసిడిటీ నివారణకు మాత్రలు వాడుతున్నట్లు సమాచారం. తోటలోని పువ్వులనించి తేనె తాగేసిన తరువాత వేరే పూల తోటకు పయనించే ‘తూనీగ’ల్లాగా అవకాశాల వేటలో అటా ఇటా అని ఆలోచిస్తున్న వారెందరో. ఏదో ఒక ప్యానెల్లో సీటు ఖాయమైన వారు అది గెలిచే టీమా కాదా అని అనుమానం, ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నవారు ఏది కరెక్ట్ ప్యానెల్ అని సమీక్ష, ప్రతి ప్యానెల్ కూ కనీసం 30 శాతం ఓట్లు గ్యారంటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎదో ఒక ప్యానెల్లో పోటీ చేయగలిగితే జాతీయ స్థాయి ప్రచారం తో పాటు, అయితే విజయం -కాకపోతే భవిష్యత్తుకు బంగారు బాట అని ప్రయత్నిస్తున్నారు .
ఈ సందర్భంగా గత ‘నమస్తే ఆంధ్ర’ కథనం లో అందరికీ నచ్చిన మూడు ‘టిట్ బిట్స్’
*సందట్లో సడేమియాల్లాగా జంప్ జిలానీలు
*ఇటూ అటూ మాట్లాడుతూ, కాల్ రికార్డింగులు చేస్తూ రహస్యాలు చేరవేసే నక్క జిత్తులగాళ్లు , సిగ్గు ఎగ్గూ లేని డబల్ ఏజెంట్లు
*వారినే తెలివిగా వాడుకుంటూ సెలెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూన్న ఇంటెలిజెంట్ అభ్యర్థులు