‘తానా లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ధ్రువీకరణ నిర్ణయంతో ఏ పనీ పాటా చేయకుండా ‘తానా’ సంస్థ పై పెత్తనం చెలాయించాలనుకునే నేతల తలరాతలు మారబోతున్నాయని పలువురు ‘తానా’ శ్రేయోభిలాషులు సంబరపడుతున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన నిబంధనలు విధి విధానాలను సంస్థ భవిష్యత్ బాగోగులను సంస్థ నడవడికను పరిస్థితులకు అనుగుణంగా నిర్దేశించవలసిన ‘తానా’ బోర్డు మే 3 న 7 గంటల పైగా సుదీర్ఘంగా (తెల్లవారుజామున 4 AM వరకు) చర్చించి తీసుకున్నారు.
ఈ ఊహించని పరిణామానికి ఇప్పటివరకూ విర్రవీగుతున్న‘బాలట్ కలెక్షన్ కింగ్స్’ దిమ్మ తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంతటి గొప్ప సంస్కరణ తేవడానికి ‘తానా’ బోర్డు చైర్మన్ ‘డాక్టర్ బండ్ల హనుమయ్య’ ధృడంగా వ్యవహరించగా, అందుకు గత మరియు తరువాతి అధ్యక్షులు ‘జయ్ తాళ్లూరి’ మరియు ‘నిరంజన్ శృంగవరపు’ వర్గీయులు అండగా ఉండగా, వ్యతిరేకంగా అట్లాంటా ‘లావు బ్రదర్స్’ మరియు అనుయాయులు శతవిధాల ప్రయత్నించారు.
ఈ పరిణామంపై సాధారణ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా, అందరికంటే ఎక్కువగా నాయకుల ఒత్తిడికి లోనై ప్రతిసారి బలవంతపు బాలట్ కవర్ కలెక్షన్లకు తెగబడే కింది స్థాయి బాలట్ కలెక్టర్లు ఆనందాన్ని గొంతులోనే దాచుకుని, వారాంతంలో ఫుల్ ఖిషీగా పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు, ముఖ్యంగా వారి భార్యలు తమ పూజలు ఫలించాయని సంబరపడుతున్నట్లు వినికిడి.
ఇప్పటికే కొత్తగా చేర్పించిన సభ్యుల ఓటు హక్కుపై ప్రతికూలంగా వచ్చిన కోర్టు తీర్పు మూలంగా ఖంగు తిని ఉన్న‘కొడాలి-లావు’ వర్గం నమ్ముకున్న ‘బాలట్ కలెక్షన్లు’ కు కూడా దెబ్బ తగలడం తో తీవ్ర నిరాశ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా ఎన్నికల తుది నిర్వహణ గడువును జూన్ 30 వరకు పొడిగించడానికి పెట్టిన ప్రతిపాదనను ‘లావు బ్రదర్స్’ మరియు వారి అనుయాయులు అడ్డుకోవడం ఎన్నికల ఫలితాలపై ఉన్న వీరి భయాలకు దర్పణం. ఈ వారమే సభ్యుల ఓటు హక్కు పై తీర్పు వచ్చిన కేసు జాప్యం మూలంగా ఎన్నికలు ‘బై లాస్’ నిర్దేశించిన ఏప్రిల్ 30వ తేదీలోగా నిర్వహించక లేకపోవడం కారణంగా కోర్టు వారి ద్వారానే ఎన్నికల తుది నిర్వహణ గడువును పొడిగించడానికి అభ్యర్దించాలని ‘తానా’ బోర్డు నిర్ణయించగా వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ పొడిగింపు నిర్ణయం రావచ్చును.
కాగా ప్రస్తుత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినందువల్ల మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ధ్రువీకరణ జరిగినందున పొందిన నైతిక మద్దతుతో ‘గోగినేని-తాళ్లూరి’ వర్గం ఎన్నికల రేసులో ముందుకు దూసికెళ్లినట్టుగా పలువురు భావిస్తున్నారు.
ఈ వర్గానికి అమెరికా వ్యాప్తంగా ఉన్న బలమైన అనుచర వర్గానికి తోడు వర్గ నాయకుడైన గత అధ్యక్షులు ‘జయ్ తాళ్లూరి’ కి ఉన్న మృదుస్వభావం అలాగే సభ్యుల ఓటు హక్కు పై వచ్చిన కోర్టు తీర్పు మూలంగా క్లీన్ చిట్ పొందిన తదుపరి అధ్యక్షుడు ‘నిరంజన్ శృంగవరపు’ ముక్కు సూటి తత్వము ‘టీం గోగినేని’ ప్యానెల్‌ను ప్రజల్లోకి విజయవంతముగా తీసుకొని వెళ్ళడానికి కారణంగా చెబుతున్నారు.
ఈ వర్గ నాయకులు ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరిస్తూ తమంత తాముగా వివాదాల్లోకి రాకుండా గుంభనంగా వ్యవహారాలూ నడుపుతూ ఉన్నంతలోనే మంచి టీం ను ఎన్నికలకి ఏర్పాటు చేయడమే కాకుండా తమకు చెందిన కొందరు ముఖ్య నాయకులను అవసరాలకు తగినట్లుగా ఎన్నికల బరిలో నిలపకుండా తమపైనే సిద్ధాంతపరంగా పోటీ చేసిన సీనియర్ నాయకుడు, వివాదరహితుడు మరియు గత ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గా అనేక సేవలందించిన’ శ్రీనివాస గోగినేని’ని టీం నాయకునిగా ఎన్నుకోవడం తో ఈ వర్గానికి ‘తానా’ సభ్యుల నుంచి గొప్ప స్పందన కనిపిస్తోంది.
అందుకు తగినట్లుగానే అందరితో సంబంధ బాంధవ్యాలు నెరుపుతూనే సంస్థ పై గౌరవంతో పాటు నిబంధనలు పట్ల ఖచ్చితంగా వ్యవహరించే’ శ్రీనివాస గోగినేని’కి అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేక పూర్వ నాయకులను, పరిచయస్తులను ‘టీం గోగినేని’కి అనుకూలంగా మార్చుకొంటూ జట్టు సభ్యులకు అనేక వ్యవహారాల్లో నాయకత్వం చేస్తూ చాపకింద నీరులా ఎన్నికలకు సమాయత్తం పరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ‘తానా’ కు కు తగిన నాయకత్వం వహించగల పరిణితి మరియు సమగ్రత ఉన్న నాయకుడిగా శ్రీనివాస గోగినేనిని గుర్తిస్తూ, అనేక నగరాల్లోని సీనియర్ సభ్యులు ‘తానా’ శ్రేయోభిలాషులు తోడ్పాటు అందిస్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు
కాగా ఎన్నికలకు ముందుగానే, ఎన్నికై పోయినట్లు భావిస్తూ రకరకాలుగా విన్యాసాలు చేసిన ‘కొడాలి-లావు’ వర్గాలు కఠోర వాస్తవాల్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్లు ఉన్నారు. ధన ప్రయోగంతో చేర్పించిన సభ్యులకు ఓటు హక్కు తెప్పించుకో లేక పోవడం, నయానో భయానో సభ్యులనుండి ఓట్లు లాక్కునే ‘బాలట్ కలెక్షన్ల’ ప్రక్రియకు విఘాతం కలుగడం, రెండు గ్రూపులు పైకి కల సాయన్న సంబడం తో పాటు వ్యక్తుల మధ్య విబేధాలు ఇంకా పూర్తిగా తొలగలేదనే వాస్తవము, తమతో పాటు గత ఎన్నికల్లో పోరాడి ఓడిన కొద్దిమంది మంచి వ్యక్తులకు కూడా ప్యానెల్లో చోటుకల్పించలేకపోవడము, ‘తానా’ కాన్ఫెరెన్సు నిర్వహణకు, ఎన్నికల ప్రచారానికి మధ్య ఉండాల్సిన అంతరాయాన్ని పాటించకపోవడం వెరసి నాయకత్వంలోని అపరిపక్వత ‘టీం కొడాలి’ అవకాశాల్ని అంతకంతకూ దిగజారుస్తోంది.
ముఖ్యం గా ప్రస్తుతం వచ్చిన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ ధ్రువీకరణ తర్వాత అట్లాంటా ‘తానా’ సభ్యుల్లో స్వతంత్రం వచ్చినంతగా సంబర వాతావరణం కనిపిస్తుండటం దేనికి సంకేతమో గట్టిగా ఆలోచించాలి. చాలా మంది సభ్యులు తమ బాలట్ కవర్ల లో ఉన్న నిజమైన ఓట్లను గత ఎనిమిదేళ్లుగా చూడలేదని వాపోతున్న విషయం అందరికీ తెలుసు. ఇదే పరిస్థితి డీసీ ఏరియా, డల్లాస్, డిట్రాయిట్, చికాగో, చార్లొట్ట్, బోస్టన్, రాలే, బే ఏరియా తదితర ప్రాంతాల్లో కూడా ఉండడం తీవ్రంగా ఆలోచించాల్సిందే.
గత ఎన్నికల్లో తమ వర్గ నాయకులైన పాత అధ్యక్షా త్రయం పై ఉన్న వ్యతిరేకత ఇంకా పోకుండానే ప్రస్తుతం తమపైనే పోరాడి ఓడించి తిరిగి కొత్తగా వచ్చిన లావు ద్వయం పై ఉన్నది వ్యతిరేకతా లేదా సానుకూలతా అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చాల్సి ఉంది. ఈ చెప్పిన వివరాలను ప్రతికూలంగా భావించకుండా సమ్యవనం తో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా ప్రయోజనం కలుగవచ్చును.
చివరిగా ‘తానా’ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ధ్రువీకరణ వంటి విప్లవాత్మక సంస్కరణ నిర్ణయాన్ని తీసుకున్న ‘తానా’ బోర్డు ను ‘నమస్తే ఆంధ్ర’ అభినందిస్తూ, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ‘తానా’ భవిష్యత్తును మంచిగా నిలవగలిగే నాయకత్వాన్నితమంత తాముగా నిర్ణయించి వోటు వేస్తే మన అందరమూ ప్రేమించే ‘తానా’ సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి తెలుగు జాతికి కి మరింతగా సేవ చేస్తుందని ఆశిద్దాం.