చిరంజీవి విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
టాలీవుడ్ లోని దర్శకనిర్మాతలతో తమ్మారెడ్డి భరద్వాజకున్న ప్రత్యేకత వేరు.
ఇండస్ట్రీతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తనదైన శైలిలో సహేతుకమైన విమర్శలు చేయడం తమ్మారెడ్డి నైజం.
అనుకున్న విషయాన్ని సుత్తి లేకుండా….సూటిగా …కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన అతికొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులలో తమ్మారెడ్డి ఒకరు.
కొద్ది రోజుల క్రితం సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ కు చిరంజీవి నమస్కరించడంపై కూడా తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
చిరు వంటి వ్యక్తి అలా వంగి వంగి దండాలు పెట్టాల్సి రావడం బాధాకరమని తమ్మారెడ్డి అనడం అప్పట్లో సంచలనం రేపింది.
ఇక, తాజాగా లైగర్ సినిమా ఫ్లాప్ కావడం, ఆ తర్వాత ఆ సినిమా బయ్యర్లకు, పూరీ జగన్నాథ్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం దుమారం రేపుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సినిమాల బడ్జెట్ పై తమ్మారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
బడ్జెట్ ను పెంచుతూ వెళుతున్న మేకర్స్ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
‘కార్తికేయ 2’, ‘కాంతార’ 16 కోట్లతో నిర్మించిన సినిమాలని, తక్కువ బడ్జెట్ తో నిర్మించడం వలన, హిట్ టాక్ తో ఆ సినిమాలు ఎక్కువ లాభాలను అందుకున్నాయని తమ్మారెడ్డి అన్నారు.
భారీ బడ్జెట్ తో ఆ సినిమాలను నిర్మించి ఉంటే ఈ స్థాయి లాభాలు కనిపించేవి కావని చెప్పారు.
30 కోట్ల స్థాయి సినిమాకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ స్థాయి వసూళ్లు రాలేదంటే ఎలా? అని తమ్మారెడ్డి నిలదీశారు.
ఏ హీరోతో ఏ కంటెంట్ సినిమా తీయాలి? ఆ హీరో ఇమేజ్ ఏంటి? ఆ హీరోపై ఎంత పెడితే ఎంత వస్తుంది? అన్న లెక్కలేసుకొని వెళ్లాలని సూచించారు.
చిరంజీవి సినిమాకు ఇంత వస్తే చాలనుకుంటున్నారని, కానీ, వాస్తవానికి చిరంజీవి సినిమాకు 1000 కోట్లు రాబట్టే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరు ఇమేజ్ కి తగిన సినిమా చేస్తే ఆ వసూళ్లు తప్పకుండా వస్తాయని, అలా వసూలు చేసిన సినిమానే చిరంజీవి ఇమేజ్ కి తగ్గ సినిమా అని తమ్మారెడ్డి అన్నారు.
ఏది ఏమైనా, సినిమాల బడ్జెట్ పై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
- జగన్ పాలన బాలేదా? కేంద్రం ఆరా!!
- రిషి సునక్ భార్య ఆస్తుల విలువ…షాకింగ్
- కొరడా దెబ్బలు తిన్న సీఎం…వైరల్