ఏపీ అధికార పార్టీలో సర్వే రాయుళ్లు పెరిగిపోయారా? ఎవరికి వారు తమ తమ పరిస్థితిని తేల్చుకునేలా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. వాస్తవానికి ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ అనేక కోణాల్లో సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.
ఐప్యాక్ సూచనల మేరకు.. మరోవైపు.. సీఎం జగన్ ఆలోచనల మేరకు ఈ సర్వేలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి నుంచి ఎంపీ ల పరిస్థితి వరకు.. ఈ సర్వేలు క్షుణ్నం గా సాగుతున్నాయి.
ఇక, అదే సమయంలో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం, ఇతర పథకాల అమలు .. దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వంటి అంశాలను కూడా సర్వేల రూపంలో సాధిస్తున్నారు. వీటిని బట్టి.. పార్టీని అలెర్ట్ చేస్తున్నారు. నాయకులకు సీఎం జగన్ అనేక విషయాల్లో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు.
ఇక, తరచుగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి నాయకుల పరిస్థితిని సీఎం నేరుగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో నే పద్ధతి మార్చుకోవాలని.. చాలా మందికి చెబుతున్నారు. దీంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు.. ఈ పరిణామం మింగుడు పడడం లేదు.
“అదేంటి మేం బాగానే ఉన్నాం.. కదా! మా పరిస్థితి బాగోలేదని ఎలా అంటారు?“ అని ఎక్కువ మంది నాయకులు భావిస్తున్నా రు. ఇదే విషయంలో వారు అంతర్మథనం కూడా చెబుతున్నారు. దీంతో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు.. స్వయంగా తమ జాత కాలను తామే.. తెలుసుకునేందుకు ప్రయత్నంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే వారి వారి నియోజకవర్గాల్లో.. బీటెక్ వంటి ఉన్నత విద్యను చదువుకున్న 10 మందిని నియమించుకుని ర్యాండమ్‌గా సర్వే చేయిస్తున్నారని సమాచారం. వీరి ఇస్తున్న రిపోర్టుల ను అధిష్టానానికి పంపించి.. తమకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకునేప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అయితే.. వీరు చేస్తున్న సర్వేలలో దాదాపు ఎమ్మెల్యేలకు పాజిటివ్ టాకే వస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రహస్యంగా చేయించుకున్న సర్వేలో ఆయనకు పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆయన తనపై తనకు నమ్మకం కుదిరిన తర్వాత.. పార్టీపై విమర్శలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒక్క వసంత అనేకాదు.. రాష్ట్రంలో 50 మంది నాయకులు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. మరి వీరి ఫలితాలను జగన్ విశ్వసిస్తాడా? లేదా? అనేది చూడాలి.