నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు, కస్టడీలో గాయపరిచారన్న ఆరోపణలు, బెయిల్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. కస్టడీలో సీఐడీ పోలీసులు తన తండ్రిని తీవ్రంగా హింసించారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని రఘురామ తనయుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ అరెస్టు, కస్టడీలో హింసించడంపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో దర్యాప్తు చేయించాలని భరత్ కోరారు.
రఘురామను హింసించడానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని, డీజీపీ, సీఐడీ ఏడీజీతో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే భరత్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
ఆ పిటిషన్ పై 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులలైన కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులిచ్చింది. ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, జగన్, సీఐడీలను తొలగించారు. దీంతో, ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వాన్ని తొలగించడంపై న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు, మరో 3 రోజుల పాటు తనకు ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని ఆర్మీ కమాండర్ కు రఘురామ లేఖ రాసిన సంగతి తెలిసిందే.