సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పోరాటం ఫలించటమే కాదు.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయన్న విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఇన్నాళ్లు పోరాడుతున్న కేజ్రీవాల్ విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. గవర్నర్ వ్యవస్థపై గుర్రుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారికి నైతిక బలాన్ని ఇవ్వటమే కాదు.. తమ వాదనకు కొండంత బలం వచ్చినట్లుగా ఫీలయ్యే అవకాశం ఉంది.
ఇంతకీ అసలు వివాదం ఏమిటి? సుప్రీం ధర్మాసనం ఏం చెప్పింది? అన్న వివరాల్లోకి వెళితే.. దేశంలో రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. రాష్ట్రాలకు కాస్త భిన్నంగా కేంద్రపాలిత ప్రాంతంలోని పరిస్థితులు ఉంటాయి. ఢిల్లీ రాష్ట్రం కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. అయితే.. దేశంలోని మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతానికి భిన్నంగా దేశ రాజధాని ఢిల్లీ ఉంటుంది. దేశ రాజధాని కావటంతో దీనికో ప్రత్యేకమైన స్వరూపం ఉంది. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్.. భూమి.. పోలీసు వ్యవస్థపై కార్యనిర్వాహక అధికారులు కేంద్రానికి ఉంటాయి.
ఇదిలా ఉంటే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం 2015లో కేంద్ర హోం శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందని పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ సానుకూల ఫలితం రాకపోవటంతో సుప్రీంను ఆశ్రయంచారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును ఇచ్చారు.
దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి ఢిల్లీలోని ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నకుంటారు. అయితే.. ఇంతకాలం పాలనాపరమైన అధికారాలు లెఫ్టెనెంట్ గవర్నర్ కు ఉంటాయన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తన తీర్పును ఏకగ్రీవంగా ఇవ్వటం గమనార్హం. తమ తీర్పులో ‘ప్రభుత్వ అధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాదికారాలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి. శాంతిభద్రతలు మినహా మిగిలిన అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలి’ అని పేర్కొంది.
ప్రజాస్వామ్యం.. ఫెడరల్ విధానాలు రాజ్యాంగ మూల స్వరూపంలో భాగమని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నకున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. ‘‘ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టెనెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి. అధికారులు మంత్రులకు వివరాలు ఇవ్వకుంటే.. వారి ఆదేశాల్ని పాటించకపోతే సమగ్ర పాలనా విధానంపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పాలనా సర్వీసులపై అసలైన అధికారులు ప్రజాప్రతినిధులతోకూడిన ప్రభుత్వానికే ఉంటాయి’’అని పేర్కొంది.