“మీరు పట్టించుకుని.. దారికితెస్తారా? లేక మమ్మల్నే జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోమంటారా?“ అంటూ.. పది రోజుల కిందట మణిపూర్ అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును నిలదీసిన సుప్రీంకోర్టు.. దీనిపై కేంద్రం స్పందించక పోయేసరికి తాజాగ సంచలన నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కారుకు ఛాన్స్ ఇవ్వకుండా తానే నిర్ణయం తీసుకుని.. ఒకరకంగా కేంద్రానికి షాక్ ఇచ్చిందనే అభిప్రాయం న్యాయ వర్గాల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.
మణిపూర్లో కుకీ, మైతేయీ వర్గాల మధ్య రిజర్వేషన్ వివాదం చెలరేగి.. రాష్ట్రం అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ.. ఎస్టీలుగా ఉన్న కుకీలపై మైతేయీ వర్గం వారు దాడులు చేయడం దేశాన్ని సైతం నివ్వెరపోయేలా చేసింది. ఈక్రమంలో మే నెలలో జరిగిన ఇద్దరుకుకీ తెగల మహిళలను నగ్నంగా ఊరేగించుకుంటూ.. పొలాల్లోకి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇది ఆలస్యంగా ఈ నెల 19వ తేదీన వెలుగు చూసింది.
దీంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రత, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చెలరేగిన హింస వంటి కీలకమైన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక, దీనిని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా.. తప్పుబట్టారు. అమానవీయ ఘటన అన్నారు. దేశం మొత్తం సిగ్గుపడుతోందని చెప్పారు. అయితే.. దీనిపై వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. మోడీ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. మీరు తక్షణం దీనిపై చర్యలు తీసుకుంటారా? బాదితులకు ఓదార్పు, నిందితులకు కఠిన శిక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అలా తీసుకోని పక్షంలో తానే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోం శాఖ తీరిగ్గా ఈ ఇద్దరు మహిళలపై జరిగిన దారుణ ఘటనను విచారించేందుకు సీబీఐని నియమిస్తున్నట్టు పేర్కొంది. కానీ, ఇతమిత్థంగా ఇంతవరకు అధికారులను నియమించలేదు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీం కోర్టుకు చెప్పింది. అయితే.. కేంద్రం నిర్ణయంపై ఏమాత్రం సంతృప్తి చెందని సుప్రీం కోర్టు తామే జోక్యం చేసుకుంటామంటూ.. సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించింది. వీరికి రక్షణ కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇది రోజువారీ జరిగే విచారణని, దీనిలో రాష్ట్ర పోలీసుల జోక్యం అవసరం లేదని.. బాధిత ప్రాంతాల్లో పర్యటించి..వారిని విచారిస్తారని తేల్చి చెప్పింది. కాగా,సుప్రీం కోర్టు చరిత్రలో ఇలా మహిళా న్యాయమూర్తులతో సిట్ వేయడం.. కేసును విచారించడం, క్షేత్రస్థాయిలో పర్యటనకు ఆదేశించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.