ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్పై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు.. ఆయన బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని సీరియస్గా వ్యాఖ్యానించింది. అయితే.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ముందుగా ఆయనకు నోటీసులు పంపించాలని, ఆ తర్వాత నిర్ణయం ప్రకటించాలని అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు .. సీఎం జగన్ సహా.. సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపించింది. జగన్ బెయిల్ రద్దు పై ఏం చెబుతారని ప్రశ్నించింది.
ఏం జరిగిందంటే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో కొన్నాళ్ల కిందట పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రఘురామ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరోసారి ధర్మాసనం స్పందిస్తూ.. వెంటనే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.