గడిచిన వారంలో దేశంలో చోటు చేసుకున్న సంచలన ఉదంతాల్లో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. వరుస పెట్టి ఆమె ఇచ్చిన తీర్పులు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. వార్తల్లోప్రముఖంగా వచ్చాయి. పెద్ద ఎత్తున చర్చకు.. సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యాయి. ఆమె తీర్పులు వివాదాస్పదంగా మారాయి. విమర్శలకు మూలమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించింది.గతంలో ఆమెను బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా నియమించాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కొలీజియం వెనక్కి తీసుకుంది. పోక్సో చట్టం కింద జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఆమెను శాశ్వత జడ్జిగా నియమిస్తూ సిఫార్సులు చేశారు. తాజాగా వాటిని వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడితే.. శరీరాన్ని నేరుగా తాకకుండా.. బట్టల మీద నుంచి తాకటం పోక్సో చట్టం కింద నేరం కాదని నిందితుడికి విధించిన శిక్షను తగ్గించారు.
మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని.. ప్యాంటు జిప్ తీయటం లైంగిక దాడి కాదంటూ కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లోనూ బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రగా చేయటం సాధ్యం కాదని.. బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోలేమంటూ ఆమె ఇచ్చిన వరుస తీర్పులు వివాదాస్పదంగా మారాయి. దీంతో.. ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కొలీజియం వెనక్కి తీసుకుంది. వరుసగా ఇచ్చిన తీర్పులు ఆమెకు ఆ అరుదైన అవకాశాన్ని మిస్ చేశాయి. వివాదాస్పద తీర్పులు జస్టిస్ పుష్పను దేశ వ్యాప్తంగా అందరికి తెలిసేలా చేస్తే.. ఆమెకొచ్చిన అవకాశం కాస్తా వెనక్కి వెళ్లిపోయింది.