ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రఘురామ దూకుడుకు బ్రేకులు వేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలను చూపించినందుకు ఓ రెండు చానెళ్లపై రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే, రాజద్రోహం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా అసలు రాజద్రోహం అంటే ఏంటో తేల్చాల్సి ఉందని పేర్కొంది.
కరోనా సంబంధిత అంశాల విషయంలో మీడియాపై నియంత్రణ విధించకూడదన్న ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలను చూపుతూ.. ఈ రెండు చానెళ్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
రెండు న్యూస్ చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణ జరిపారు. తమ రెండు చానెళ్లే కాకుండా మరికొన్ని కూడా ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేశాయని వాదించాయి.
రాజద్రోహానికి సంబంధించి పరిమితులను కోర్టులు నిర్వచించాల్సిన సమయం వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆ రెండు చానెళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. చానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టడం అనేది చాలా తీవ్రమైనది. అసలు రాజద్రోహం ఏంటో కోర్టులు చెప్పాల్సిన సమయం వచ్చింది అని చంద్రచూడ్ అన్నారు.
ఇదిలాఉండగా, ఇప్పటికే ఎంపీరఘురామకృష్ణంరాజు తన అరెస్టు సందర్భంగా జరిగిన పరిణామాలపై పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా తనకు చికిత్స జరిగిన ఆర్మీ ఆస్పత్రిలో కూడా పలు సంఘటనలు అనుమాస్పదంగా ఉన్నాయని రఘురామ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ అరెస్టు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.