లిక్కర్ స్కామ్ లో ఏపీ సీఐడీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అని భయపడుతున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా బిగ్ రిలీఫ్ లభించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకోవడంతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. పలువురిని నిందితులుగా చేర్చింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన జస్టిస్ జేవీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం.. తాము ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా, లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఇంతవరకు మిథున్ రెడ్డి పేరును సీఐడీ పోలీసులు చేర్చలేదు.
లిక్కర్ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. సీఐడీ ఇంకా అరెస్టుల వరకూ వెళ్లలేదు. అయినా కూడా ఇటీవల మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు బెయిల్ ఎలా ఇస్తామంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఆ మరుసటి రోజే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో ఏపీ సీఐడీ బృందాలు చేరాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఏపీ సీఐడీని ఆదేశించింది.