కీలకమైన గుజరాత్ ఎన్నికలకు ముందుసుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో మోడీ సర్కారు తీసుకువచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు.ఈ తీర్పు గుజరాత్ ఎన్నికలకు ముందు మోడీకి దన్నుగా నిలిచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. అయితే మిగతా ముగ్గురు న్యాయమూర్తులతో జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ యూయూ లలిత్ విభేదించారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్.. సామాజిక న్యాయం, ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తుందని జస్టిస్ రవీంద్రభట్ వ్యాఖ్యానించారు. సమానత్వ సూత్రానికి భంగం కలిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్రభట్తో జస్టిస్ యూయూ లలిత్ ఏకీభవించారు.
న్యాయమూర్తులు ఏమన్నారంటే..
” రిజర్వేషన్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మాత్రమే కాకుండా.. వెనుకబడిన ఏ వర్గానికైనా అవసరం. కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదు. ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్సీ, ఎస్టీలను మినహాయించడం, ఇప్పటికే ఉన్న 50 శాతం రిజర్వేషన్‌కు అదనంగా ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే.“ అని జస్టిస్ దినేశ్ మహేశ్వరి అన్నారు.
“వెనుకబడిన తరగతుల హక్కులను ఈ సవరణ ఉల్లంఘించదు. కుల వ్యవస్థలో ఉన్న అసమానతలను తొలగించడానికి రిజర్వేషన్లు తీసుకొచ్చారు. 75 ఏళ్ల తర్వాత దీన్ని పునఃపరిశీలించవలసిన, రాజ్యాంగ తత్వానికి అనుగుణంగా జీవించవలసిన అవసరం ఉంది“ అని జస్టిస్ బేల ఎమ్ త్రివేది వ్యాఖ్యానించారు.
“సామాజిక, ఆర్థిక న్యాయం పొందేందుకు రిజర్వేషన్ ఓ మార్గం మాత్రమే. అదే పరిష్కారం కాదు. అయితే ఈ రిజర్వేషన్లు స్వార్థ ప్రయోజనాలకు ఓ అస్త్రంగా మారకూడదు. రిజర్వేషన్లను నిరవధికంగా కొనసాగించకూడదు. 103వ సవరణను సమర్థిస్తున్నా.“ అని జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు.
“రాజ్యాంగ 103వ సవరణ సామాజిక న్యాయం, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని బలహీనపరుస్తుంది. దీన్ని రాజ్యాంగం అనుమతించదు. సామాజిక, వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను పొందుతున్న వారు బాగుపడ్డారని ఈ సవరణ మనం భ్రమ పడేలా చేస్తోంది. రెట్టింపు ప్రయోజనాలను అందించే ఈ సవరణ సరికాదు.పేదరికం, ఆర్థిక వెనుకబాటుతనం ఈ సవరణకు వెన్నెముక లాంటివి. దాని ఆధారంగా ఇది అజేయమైనది. అయితే.. రాజ్యాంగం నిషేధించిన వివక్షను.. ఈ సవరణ అవలంబిస్తోంది. సమానత్వాన్ని ఉల్లంఘిస్తోంది. ఈడబ్ల్యూఎస్.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించింది. ఇది మరిన్ని ఉల్లంఘనలకు దారితీస్తుంది. సమాజం మరింతగా విడిపోయోలా చేస్తుంది.“ అని జస్టిస్ రవీంద్ర భట్ వ్యాఖ్యానించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యాజ్యాన్ని ‘జనహిత్ అభియాన్’ అనే సంస్థ 2019లో దాఖలు చేసింది. 103వ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటితో పాటు సుమారు 40 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు ఇచ్చిన ఈ తీర్పు ప్రధాని నరేంద్ర మోడీకి అస్త్రంగా మారుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.