దేశ అత్యున్నత న్యాయస్థానం ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీతో పాటు.. బిహార్ ప్రభుత్వానికి ఆక్షింతలు తప్పలేదు. తాము జారీ చేసిన ఆదేశాల్ని పాటించకపోవటంపై వివరణ కోరింది. అంతేకాదు.. విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు సమన్లు జారీ చేసింది. కరోనా బారిన పడి మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల్ని జారీ చేసింది.
తమ ఆదేశాల్లో భాగంగా మహమ్మారితో మరణించిన బాధితుడి కుటుంబానికి రూ.4లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆదేశాల్ని అమలు చేసే విషయంలో ఏపీ.. బిహార్ ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లుగా గుర్తించిన సుప్రీంకోర్టు.. దీనిపై వివరణను కోరింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు సమన్లనుజారీ చేశారు. దీంతో.. ఈ రోజు (బుధవారం) వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు విచారణకు హాజరుకానున్నారు.
సుప్రీం ఆదేశాలు అమలు కాలేదంటూ.. ఈ రెండు రాష్ట్రాల మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు జారీ అయ్యాయి.
దీంతో స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమస్థానం.. వీటిని విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎంఆర్ షా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్లపై విచారణను చేపట్టింది. ప్రధానకార్యదర్శులు ఏమీ చట్టానికి అతీతులు కాదన్న ధర్మాసనం.. వారిని విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. పరిహారాన్ని అందించటంలో ఆలస్యం కావటానికి కారణాల్ని వివరించాల్సి ఉంటుంది. కొవిడ్ బారిన పడటం.. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు గత ఏడాది జూన్ 30న జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అథారిటీని ఆదేశించింది. వీటికి అవసరమైన మార్గదర్శకాల్ని రూపొందించాలని కోరింది. అయితే.. ఈ పరిహారాన్ని అందించలేదంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.