ఫిలిం ఇండస్ట్రీలో మరో విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన జయం రవి.. తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో రవి ఎంత అన్యోన్యంగా ఉన్నాడో అందరికీ తెలుసు. చాలా ముచ్చటగా కనిపించిన ఈ జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకునేవారు.
అలాంటి జంట 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించబోతోందనే వార్త జనానికి రుచించలేదు. గతంలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించినపుడు ఎలా బాధ పడ్డారో.. ఇప్పుడు వీరి విషయంలోనూ ఫీలవుతున్నారు. ఐతే విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగి ఉంటాయని భావించారు కానీ.. జయం రవి చేసిన ప్రకటనను తప్పుబడుతూ ఆర్తి ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తనకు తెలియకుండానే, తన అనుమతి లేకుండానే విడాకుల గురించి జయం రవి బహిరంగ ప్రకటన చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
విడాకుల ప్రకటన గురించి తెలిసి తాను షాక్కు గురైనట్లు, ఎంతో బాధ పడినట్లు ఆమె చెప్పారు. 18 ఏళ్లుగా తాము కలిసి ఉంటున్నామని.. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకో మాట చెప్పకుండా ప్రకటించడం బాధించిందని ఆర్తి పేర్కొంది. తమ మధ్య కొంత కాలంగా విభేదాలున్న మాట వాస్తవమని.. వాటిని పరిష్కరించుకోవడానికి ఎంతో ప్రయత్నించానని.. తన భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని.. కానీ దురదృష్టవశాత్తూ తనకా అవకాశం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ స్టేట్మెంట్ మీద జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి. జయం రవి, ఆర్తి ఒక టీవీ షోలో పాల్గొన్నపుడు పరస్పరం తమ మధ్య ఉన్న ప్రేమ గురించి ఇద్దరూ గొప్పగా మాట్లాడారు. ప్రెగ్నెంట్ అయినపుడు రవి తనకు చేసిన సేవ గురించి ఆమె చెబితే.. డెలివరీ అయ్యాక ఏ బిడ్డ పుట్టింది అని కూడా అడక్కుండా ఆర్తి ఎలా ఉందని మాత్రమే అడిగినట్లు రవి చెప్పాడు. ఇంత అన్యోన్యంగా ఉన్న జంట ఇలా విడిపోవడం విచారకరం.