శ్రీలంక మాజీ ప్రధానమంత్రి రాజపక్సేకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. రాజపక్స దేశం విడిచిపెట్టి వెళ్ళకుండా ఆయనపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ప్రధానమంత్రిగా మహేంద్ర రాజపక్సే, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలిసిందే.
రాజకీయ, ఆర్ధిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టేసిన రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా జనాలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు ఏకమైపోయి దాదాపు నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ముందు ప్రశాంతంగానే మొదలైన ఆందోళనలు చివరకు హింసాత్మకంగా మారిపోతోంది. దీంతో అన్ని వైపుల నుండి పెరిగిపోతున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక ప్రధానిగా మహేంద్ర రాజపక్స మూడు రోజుల క్రితమే రాజీనామా చేశారు.
దేశాభివృద్ధిని నాశనం చేసేసి మొత్తం కుటుంబంతో విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని రాజపక్సేను జనాలు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జరుగుతున్న హింసాత్మక ఆందోళనలపై కోర్టులో విచారణ మొదలైంది. విచారణలో ఏమి తేలుతుందో తెలీకుండానే మహేంద్ర దేశం వదిలి పారిపోకుండా ఆయనతో పాటు ఆయన కొడుకు నమల్ రాజపక్సేతో పాటు మరో 15 మందిపై కోర్టు ట్రావెల్ బ్యాన్ విధించింది.
ఆయన కుటుంబం కాకుండా ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న వారిలో కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. జరిగిన హింసాత్మక ఘటనల్లో కొన్నింటి వెనుక కుట్ర దాగుందని అటార్నీ జనరల్ ఆరోపిస్తున్నారు. జరిగిన కుట్రలో అనుమానితులుగా ఉన్న వారిలో కొందరిని విచారించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ అంటున్నారు.
అందుకనే ముందు జాగ్రత్తగా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని అటార్నీ జనరల్ కోరిక ప్రకారమే కోర్టు వీరిపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ గొడవలన్నీ జరుగుతుండగానే కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికైన ప్రధానమంత్రి వెంటనే బాధ్యతలు కూడా తీసేసుకున్నారు. రాజపక్సే కుటుంబం పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్ధ తల్లకిందులైపోయిన విషయాన్ని అందరూ చూస్తున్నదే. మరి కోర్టు విచారణలో చివరకు ఏమి తేలుతుందో చూడాల్సిందే.