ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. “జగన్ నీకు బు ర్రుందా? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా?“ అని ప్రశ్నించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. మీడియా తో మాట్లాడుతూ.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని.. సీఎం చంద్రబాబు ఎంత సేపు మైకులో మాట్లాడుతారో.. అంత సమయం కూడా తనకు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అదేసమయం లో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ వేశామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని జగన్ చెప్పారు.
ఇదేసమయంలో.. హైకోర్టు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి(పేరు పెట్టి చెప్పలేదు) `సమన్లు` జారీ చేసిందని కూడా.. జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి ఆయన సమాధానం చెప్పలేదని అందుకే తాము అసెంబ్లీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నామని కూడా జగన్ వ్యాఖ్యానించారు. కాగా..జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అయ్యన్న స్పందించారు. ఈ క్రమంలోనే జగన్ నీకు బుర్రుందా? అని ప్రశ్నించారు.
“స్పీకర్‌కు సమన్లు జారీ చేయడం ఏటండి? ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? ఏమనుకుంట న్నాడు.. స్పీకర్ సీటంటే.. వైసీపీ ఇచ్చిన పదవి అనుకుంటున్నాడా ఏంటి? బుర్రా బుద్ధి లేకుండా మాట్లా డుతున్నాడు“ అని జగన్‌పై అయ్యన్న తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అసెంబ్లీకి రాననడంపైనా అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. “బుర్రున్నోడెవడు.. జగన్‌లా మాట్లాడడు. ప్రతిపక్షం హోదా అనేది ప్రజలివ్వాల. నీకు ఎన్ని సీట్లిచ్చారు.. 11. ఇంతోటి దానికి నీకు ప్రధాన ప్రతిపక్షం కావాలా? ప్రజలే నీకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు. మేమెలా ఇస్తాం.. బుర్రుండాలి కదా!“ అని వ్యాఖ్యానించారు.
అయితే.. జగన్ సభకు రావాలనే తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని.. అయ్యన్న వ్యాఖ్యానించారు. రాజకీయాలు వేరు.. సభ వేరు.. అనే సంగతి జగన్‌కు తెలియడం లేదన్నారు. సభకు వచ్చి, హుందాగా వ్యవహరిస్తే.. మైకు ఇస్తామని చెప్పారు. ప్రజలతరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే తాము కోరుకుంటు న్నామని చెప్పారు. “మైకివ్వమని ఎవరు చెప్పారు? ఆయన వచ్చి.. సీటులో కూర్చుంటే.. ఎందుకివ్వం. ముందు సభకు రావాలి కదా! ముందు రమ్మనండి“ అని అయ్యన్న వ్యాఖ్యానించారు. కాగా.. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.