కరోనా కాలంలో వందలాది మందికి సాయం చేసి నిజమైన హీరోగా నిలిచిన సోనూసూద్‌ను చేర్చుకోవడానికి చాలా పార్టీలు ప్రయత్నాలు చేశాయి. ఆయనకున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని చూశాయి. కానీ రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించిన ఆయన పార్టీలకు దూరంగా ఉండిపోయారు. కానీ పంజాబ్ రాష్ట్రానికి మాత్రం అధికారిక ప్రతినిధిగా ఉండేందుకు ఓకే చెప్పారు. పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గుర్తింపునిచ్చింది. ప్రభుత్వం తరపున కొన్ని ప్రచార కార్యక్రమాలకు తమ ప్రతినిధిగా ఆయన సేవలను ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు ఈ స్టేట్ ఐకాన్ అనే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ పదవిలో ఇక ఉండలేనని స్పష్టం చేశారు. అయితే తన సోదరి కోసమే ఆయన ఈ పదవికి రాజీనామా చేశారని తెలిసింది.
ఆ ఎన్నికల్లో పోటీ..
ఫిబ్రవరిలో పంజాబ్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మోగా స్థానం నుంచి ఆమె బరిలో దిగబోతున్నట్లు సమాచారం. తన సోదరుడిలాగే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆమె ఇప్పటికే వెయ్యి సైకిళ్లను విద్యార్థినులకు పంచి పెట్టారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని ఆమె సొంతంగానే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు టాక్. మరోవైపు మాళవిక తరపున సోనూ సూద్ ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా ఉన్న ఆయనపై ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదులందాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సోనూ సూద్ వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో తన సోదరికి ఇబ్బంది కలగకూడదనే ఆయన స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఆమె సోలోగా..
మాళవిక సూద్ ఎన్నికల్లో సోలోగా పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ఆమె మోగా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా తన సోదరుడు ఆమెకు అండగా నిలబడ్డారు. మిగతా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిస్తే స్కూటర్లు, సెల్ఫోన్లు ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. కానీ ఆమె మాత్రం ముందే సైకిళ్లు పంచి విద్యార్థినుల అవసరాలు తీర్చి స్థానికుల మనసులు గెలుచుకుంది. పార్టీలను పక్కనపెట్టిన ఆమె ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు. పంజాబ్‌లో ప్రస్తుతం రైతులే ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తిగా ఎదిగారు. మరోవైపు రైతు సంఘాలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. దీంతో మోగా నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న మాళవిక విజయం సాధించే అవకాశాలున్నాయి సర్వేలు చెబుతున్నాయి.