భర్తల కోసం భార్యలు, ప్రియుడి కోసం ప్రియురాలు ధర్నా చేయడం వంటి సంఘటనలు ఇప్పటివరకు మనం ఎన్నో చూసుంటాము. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది బాసు.. తాజాగా భార్యల కోసం ఇద్దరు భర్తలు నిరసనకు దిగారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భర్తలు నిరసనకు దిగింది తమ అత్తారింటి ముందు కాదు. వినూత్నంగా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆసక్తికర సంఘటన ఏలూరు లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏలూరుకు చెందిన శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అనే వ్యక్తి 2015లో తన పెద్ద కుమార్తెను గుజరాత్లో ప్రైవేట్ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న పవన్‌కి, 2024 లో చిన్న కూతురిని విజయవాడలో యానిమేషన్ ఉద్యోగం చేస్తున్న శేషసాయికి ఇచ్చి వివాహం చేశారు. ఏ తండ్రి అయినా పెళ్లి తర్వాత కూతుళ్లను అత్తారింటికి పంపిస్తాడు. భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ శ్రీనివాస రామానుజ మాత్రం పెద్ద కుమార్తెకు బిడ్డ పుట్టిన సంవత్సరం నుంచి ఆమెను కాపురానికి పంపించడం మానేశాడు.
అలాగే పెళ్లైన కొద్ది నెలలకే చిన్న కూతురిని కూడా కాపురానికి పంపకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు. దీంతో ఈ శాడిస్టు మామకు వ్యతిరేకంగా అల్లుళ్లు పవన్, శేషసాయి రోడ్డెక్కారు. మా భార్యలు మాకు కావాలి.. కాపురానికి పంపండి అంటూ టెంట్ వేసి మరీ ఏలూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు.
`ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపకుండా.. అల్లుళ్లపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలి. మా భార్యలను కాపురానికి పంపించాలి. కన్న కూతురిని తండ్రి చూపించాలి. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి` అంటూ అల్లుళ్లు ఇద్దరూ డిమాండ్ చేస్తున్నారు.