దిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులూ వెళ్లారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల కోసం ఏం చేయాలి? ఏఏ నాయకులను బీజేపీలోకి ఆకర్షించాలి? కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలి? టీఆర్ఎస్ పాలనను ఎలా అంతం చేయాలి వంటి అంశాలపై పక్కా ప్రణాళికలు వేసి వాటిని బీజేపీ అధిష్టానం ముందు ఉంచడానికి మెటీరియల్ సిద్ధం చేసుకుని వెళ్లారట.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పితూరీలు, ఫిర్యాదులు మోసుకెళ్లారట. ముఖ్యంగా పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో జోడీ కట్టే ప్రయత్నాలు చేస్తుండడంపై సోము వీర్రాజు బీజేపీ అధిష్టానానికి రిపోర్టులు సమర్పించారట.
ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పక్కచూపులు చూస్తోందని.. తమను అస్సలు పట్టించుకోవడం లేదని.. పొత్తు ఉందని అనుకోవడమే తప్ప జనసేన క్యాడర్ ఎక్కడా బీజేపీకి సహకరించడం లేదని.. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణే స్వయంగా చంద్రబాబుతో అంటకాగుతుంటే ఇక ఆయన క్యాడర్ బీజేపీని ఎందుకు పట్టించుకుంటారని సోము బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. దాంతో బీజేపీ, జనసేన కలిసికట్టు ప్రయాణం స్పీడందుకుంటుందని అంతా భావించారు. కానీ, పవన్ మాత్రం బీజేపీ నేతల కంటే చంద్రబాబుకు సంబంధించిన విషయాలు, టీడీపీకి సంబంధించిన విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కూడా. సోము వీర్రాజు కూడా ఇవే విషయాలు బీజేపీ పెద్దలకు చేర్చినట్లు తెలుస్తోంది.
అదేసమయంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా సోము వీర్రాజు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో రాసుకుని తిరుగుతున్న పవన్ కల్యాణ్‌కు కన్నా బహిరంగ మద్దతు ప్రకటించిన విషయం కూడా పార్టీ పెద్దల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
ఏపీలో రానున్న ఎన్నికల్లో బీజేపీ సీట్లు సాధించడానికి ఏం చేయాలనే విషయంలో సరైన ప్రణాళికలు ఏమీ లేకుండా మిగతా పార్టీల నేతలు, సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే సోము ఎక్కువ టైం కేటాయించారని బీజేపీకి చెందిన నాయకులే అంటున్నారు.