గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె..
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నిలువెత్తు ఆశావాదం నిట్టనిలువునా కూలిపోయే దృశ్యం ఇంత త్వరగా ఎదురౌతుందని ఊహించలేదు..
‘అన్నగారూ…’ అని మీరు నోరారా పిలిచినా ‘తమ్ముడూ..’ అని పిలిచే ధైర్యం చెయ్యలేకపొయానెప్పుడూ..
ఇప్పుడు ఏమని పిలిచినా పలకలేనంత దూరం వెళ్ళిపోయారా శాస్త్రిగారూ..!
ఇది అన్యాయమండీ..
20 సంవత్సరాల అత్మీయతలో ప్రతిక్షణం విలువైన జ్ఞాపకమే…
మనం మాట్లాడుకున్న వేలాది గంటలు మనసు ముంగిట్లో నిల్చుని మౌనంగా రోదిస్తున్నాయి.
మీతో ఇంక మాట్లాడే అవకాశం లేదు, రాదు.. మీ పాటల్లోనే మిమ్మల్ని చూసుకోమని మీరెప్పుడూ చెప్పలేదు కానీ అదే మిగిలిందిప్పుడు…!
మాట మౌనమయ్యింది.. కన్నీరు గడ్డకట్టి పోయింది..!!
–కిరణ్ ప్రభ