ప్రముఖ స్టార్ సింగర్ కల్పన రాఘవేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను పోలీసులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్ కేసులో మొదట ఆవిడ భర్త ప్రసాద్ ప్రభాకర్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఆ తర్వాత కన్న కూతురు కారణంగానే కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కల్పన కూతురు కేరళలో ఉంటూ చదువుకుంటోంది. అయితే మంగళవారం తల్లీకూతుళ్ల మధ్య ఫోన్ లో వాగ్వాదం జరిగిన విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కూతురును హైదరాబాద్ వచ్చేయాలని కోరగా, అందుకు ఆమె ఒప్పుకోలేదని.. దాంతో మనస్తాపం చెందిన కల్పన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన కల్పన కూతురు.. తన తల్లిది సూసైడ్ కాదని చెబుతోంది.
కల్పన విషయం తెలియగానే కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్న కూతురు.. మీడియాతో మాట్లాడింది. తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపింది. వైద్యుల సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుందని.. అవి ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారని పేర్కొంది. తమ ఫ్యామిలీలో ఎటువంటి గొడవులు లేవని స్పష్టం చేసింది. తన తల్లి కల్పన హైదరాబాద్లో లా పీజీ చేస్తోందని.. మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడుతుందని.. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటోందని కల్పన కూతురు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కల్పన కూతురు స్టేట్మెంట్ వైరల్ గా మారింది.