కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీజేపీ నియమావళి ప్రకారం యడ్డీకి 75 ఏళ్లు దాటాయి కాబట్టే సీఎం పదవికి రాజీనామా చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే, యడ్డీ రాజీనామాపై విపక్షాల విమర్శలు మరోలా ఉన్నాయి. యడ్డీపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే ఆయనను పదవి నుంచి బలవంతంగా తొలగించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఓ ఛాలెంజ్ విసిరారు. యడ్డీ అవినీతిపై విచారణ చేసే దమ్ము మోడీకి ఉందా అని సిద్ధూ ప్రశ్నించారు. ‘నా ఖావుంగా.. నా ఖానే దుంగా’ (తినను.. తిననివ్వను) అన్నది మోదీ నినాదమని, దానిని ఆచరణలో పెట్టే అవకాశం మోదీకి ఇపుడు వచ్చిందని సిద్ధూ చురకలంటించారు. మోదీకి దమ్ముంటే యడియూరప్ప అవినీతిపై ఎంక్వయిరీ వేయాలని సిద్ధూ డిమాండ్ చేశారు. యడ్డీ, మోదీలపై వరుస ట్వీట్లతో సిద్ధూ విరుచుకుపడ్డారు.
కాగా, అంతకుముందు యడ్డీపై కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మోదీని కలిసేందుకు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన యడ్డీ 6 సూట్ కేసుల నిండా కానుకలు తీసుకు వెళ్లారని, అక్కడే మోదీని ప్రసన్నం చేసుకున్నారని కుమార స్వామి ఆరోపించారు. ఆ సూట్ కేసుల్లో ఏముందో చెప్పాలని యడ్డీని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాల మధ్య యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఏపీ టార్గెట్ గా బీజేపీ అధిష్టానం పావులు కదపనుందని, యడ్డీని ఏపీ గవర్నర్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.