ఏపీలో పెండింగ్ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతోన్న సంగతి తెలిసిందే. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వివిధ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. అయితే, రాష్ట్రం మొత్తం ఒక లెక్క…టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలాకా అయిన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఒక లెక్క అన్నట్లుగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో, కుప్పం కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి
ఈ క్రమంలోనే తాజాగా ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే, అనూహ్యంగా కుప్పం ఫలితాల్లో టీడీపీకి షాక్ తగిలింది. కడపటి వార్తలందేసరికి కుప్పం మున్సిపాల్టీలో ఉన్న మొత్తం 25 వార్డుల్లో వైసీపీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. కుప్పంలోని 5,11వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో, కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చేజారినట్లయింది. కుప్పంలోని మొత్తం 25 వార్డులకు గానూ 24 వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.14వ వార్డు వివాదాస్పద రీతిలో ఏకగ్రీవమైంది.
కుప్పంలో తాజాగా 1,2,3,4,6,7,8,9,10,15 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందడంతో టీడీపీకి షాక్ తగిలినట్లయింది. ఇక, ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లిలో వైసీపీ, టీడీపీ ల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. దీంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీల్లో వైసీపీ గెలిచింది. దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండ మునిసిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది.