టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై విమర్శలు గుప్పించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. చంద్రబాబుపై వైసీపీ నేతలు అవాస్తవమైన ఆరోపణలు చేయడం, విష ప్రచారం చేయడం అలవాటుగా మారింది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన జగన్ ను టీడీపీ నేతలు విమర్శిస్తున్నారన్న కారణంతో…చంద్రబాబుకూ అక్రమాస్తులున్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు కొందరు వైసీపీ నేతలు.
గురివింద నలుపు దానికి తెలీదన్న చందంగా జగన్ అవినీతిని కప్పి పెట్టి మరీ ప్రతిపక్ష నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకున్న ఆస్తులపై విచారణ జరపాలంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి గతంలో ఏపీహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ…దానిని సవాల్ చేస్తూ లక్ష్మీ పార్వతి సుప్రీం కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఆస్తులకు సంబంధించి విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. గతంలో హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆ పిటిషన్ ను కొట్టివేసిందని సుప్రీం కోర్టు బెంచ్ వెల్లడించింది. పిటిషన్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ లక్ష్మీపార్వతిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు తాజా తీర్పుతో లక్ష్మీ పార్వతికి షాక్ తగిలినట్లయింది. ఏదో బురదజల్లాలని పిటిషన్లు వేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆమెపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఒక వేలు చంద్రబాబుపై చూపిస్తే..నాలుగు వేళ్లు జగన్ వైపు చూపిస్తున్నాయని, ముందు జనగ్ ఆస్తులపై లక్ష్మీ పార్వతి ఫోకస్ చేయాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.