తన పెళ్లితో సంచలనంగా మారిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తొమ్మిదేళ్ల దాంపత్య జీవనం తర్వాత తాజాగా విడిపోయారు. తన కంటే పదకొండేళ్ల పెద్దదైన ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లాడటం.. పెళ్లి నాటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండటం.. వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన శిఖర్.. పెళ్లి తర్వాత మెల్ బోర్న్ లో ఉండటం తెలిసిందే. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
బాక్సింగ్ క్రీడాకారిణి అయిన ఆయేషాకు ఫేస్ బుక్ ద్వారా శిఖర్ ధావన్ పరిచయమయ్యారు. వారిద్దరి మధ్య చాటింగ్ మొదలైన కొన్నాళ్లకే.. ప్రేమలో పడటం.. ఇద్దరు పెళ్లి చేసుకోవటం తెలిసిందే. 35 ఏళ్ల శిఖర్ ధావన్ తన కంటే పదకొండేళ్లు పెద్దదైన 46 ఏళ్ల ఆయేషాను ప్రేమించి పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. శిఖర్ పెళ్లికి ఆమె తల్లి పూర్తి మద్దతును ప్రకటించారు.
వ్యక్తిగతంగా.. తన కెరీర్ ఎదుగుదలతో తన భార్య పాత్ర ఎంతో ఉందని చెప్పే శిఖర్ ధావన్.. తాజాగా తన భార్యతో విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ దంపతుల మధ్య కొంతకాలంగా విబేధాలు పొడచూపటం.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో కావటం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఆయేషా.. తన ఖాతాలోని శిఖర్ ధావన్ ఫోటోలు అన్నింటిని పూర్తిగా తొలగించింది. అంతేకాదు.. విడాకుల మీద భారీ భావోద్వేగ పోస్టును పెట్టటం ద్వారా.. విడాకుల విషయాన్ని చెప్పేసింది.
తన జీవితంలో రెండోసారి విడాకులు తీసుకోవటంపై తన సోషల్ మీడియా ఖాతాలో ఆయేషా ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా వీరిద్దరూ సఖ్యతగా ఉండటం లేదని.. ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయేషా తన ఖాతాలోని శిఖర్ ఫోటోల్ని పూర్తిగా తొలగిస్తే.. శిఖర్ మాత్రం ఆమె ఫోటోల్ని అలానే ఉంచేయటం గమనార్హం.
తాజాగా పోస్టు చేసిన ఎమోషనల్ పోస్టులో పలు వ్యాఖ్యలు చేశారు.
‘‘విడాకులు అనే పదం ఒక చెత్త పదంగా భావించాను. కానీ.. నేను రెండుసార్లు విడాకులు తీసుకున్నాను. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎలా అనిపించిందో.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు కూడా అంతే భయంకరంగా అనిపిస్తోంది.ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. నేనేమిటో నిరూపించుకోవటానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో రెండోసారి కూడా విడాకులు తీసుకోవటం చాలా భయానకంగా అనిపిస్తోంది’’ అంటూ తన ఫీలింగ్స్ ను ఆమె పోస్టు చేసి పెట్టారు.