సంక్రాంతి సందర్భంగా తెలువారికి మోడీ సర్కారు ఇచ్చిన బహుమతిగా విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ను అందుబాటులోకి తేవటం తెలిసిందే. తాజాగా మరో వందే భారత్ ను తెలుగు రాష్ట్రాలకు బహుమతిగా కేంద్రం ఇస్తోంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడుస్తుంది. ఏప్రిల్ 9 నుంచి పట్టాల మీద పరుగులు తీయనున్న ఈ రైలుకు సంబంధించిన టైమింగ్స్ ను వెల్లడించారు.
వారంలో మంగళవారం మినహా మిగిలినఅన్ని రోజుల్లోనూ ఈ రైలు తిరుగుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికి అందుబాటులో ఉన్న ట్రైన్లలో ఈ మార్గంలో కనిష్ఠంగా 11 గంటలు గరిష్ఠంగా 15 గంటల ప్రయాణం ఉంది. అందుకు భిన్నంగా వందేభారత్ రైలుమాత్రం కేవలం 8.30 గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించనుంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్తగా మారిన ఈ వందే భారత్ కు సంబంధించిన ఒకే ఒక్క సమస్య ఏమంటే.. టైమింగ్స్ సరిగా లేకపోవటం అన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. సికింద్రాబాద్ లో తెల్లవారుజామున ఆరు గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ తిరుపతికి వెళ్లే సరికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరే ట్రైన్ సికింద్రాబాద్ చేరుకునేసరికి అర్థరాత్రికి కాస్త ముందుగా 11.45 గంటలకు చేరుకుంటుంది. ఉదయాన్నే మరికాస్త ముందు బయలుదేరి మధ్యాహ్నం కాస్త ముందుగా చేరుకుంటే.. సాయంత్రం వేళకు దర్శనం పూర్తి చేసుకొని.. రాత్రికి బయలుదేరి తర్వాతి రోజుకు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ.. ప్రస్తుత టైమింగ్స్ ఏ మాత్రం సెట్ కావన్న మాట వినిపిస్తోంది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వచ్చే ట్రైన్ ను చూస్తే.. రాత్రి 11. 45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఒకవేళ పావు గంట నుంచి అరగంట ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే.. ఇంటికి చేరుకునే సరికి అర్థరాత్రి ఒంటి గంటకో కానీ చేరుకోలేని పరిస్థితి. ఆ సమయంలో ప్రయాణికులు ఆటోల్లోనూ.. క్యాబ్ లోనూ ఇంటికి చేరటం కష్టమే కాదు.. ఖర్చుతోకూడుకున్న పనిగా మారుతుంది. టికెట్ డబ్బులు ఎంత అవుతాయో..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి చేరేందుకుక్యాబ్ కు అయ్యే ఖర్చు ఒకేలా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. వందే భారత్ ట్రైన్ రావటం వరకు బాగానే ఉంది కానీ.. దాని టైమింగ్స్ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక.. టైమింగ్స్ విషయానికి వస్తే..
సికింద్రాబాద్ – తిరుపతి వందే బారత్ కు 20701 నెంబరును కేటాయించారు.
ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది
ఉదయం 7.19 గంటలకు నల్గొండకు చేరుతుంది
గుంటూరుకు ఉదయం 9.45 గంలలకు చేరే ఈ ట్రైన్ ఒంగోలుకు 11.09 గంటలకు చేరిపోతుంది.
నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు.. తిరుపతికి2.30 గంటలకు చేరుంది.
తిరుగు ప్రయాణం విషయానికి వస్తే తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ కు 20702 నెంబరునుకేటాయించారు.
మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.
నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు.. ఒంగోలుకు 6.30 గంటలకు.. గుంటూరుకు 7.45 గంటలకు చేరుతుంది.
నల్గొండకు రాత్రి10.10 గంటలకు.. తిరుపతికి 11.45 గంటలకు చేరుకుంటుంది.