కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలోని హాస్టల్లో ఉన్న వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాల కలకలం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ యువతి…. అమ్మాయిలు స్నానం చేసే వాష్ రూమ్ లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసిందని, దాదాపు 300 మంది యువతుల నగ్న వీడియోలు అందులో ఉన్నాయని పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
ఇక, ఈ క్రమంలోనే ఈ అంశంపై తాజాగా మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కాలేజీ బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్నది బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని లోకేష్ చెప్పారు. అక్కడ హిడెన్ కెమెరాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని లోకేష్ క్లారిటీనిచ్చారు. ఒక నలుగురు విద్యార్థులు మధ్య వివాదం ఉందని, అది వారికి సంబంధించిన విషయం మాత్రమేనని లోకేష్ చెప్పారు. అందుకు కారణమైన వారిని అరెస్ట్ చేశామని అన్నారు.
సినీనటి జస్వానీపై వైసీపీ నేతలు వేధింపులు, మద్యం స్కాం, భూ అక్రమాలు పక్కదారి పట్టించేందుకు హిడెన్ కెమెరాల నాటకానికి తెర తీశారని లోకేష్ ఆరోపించారు. జగన్ మాదిరి తాను తల్లిని, చెల్లిని రోడ్డుపైకి గెంటేసి రకం కాదని, విద్యార్థులు తన తోబుట్టువులని లోకేష్ చెప్పుకొచ్చారు. వారిని కంటికి రెప్పలా కాపాడతానని హామీ ఇచ్చారు. కాగా, తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో వరద బాధితులను లోకేష్ పరామర్శించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు సరఫరా చేయాలని, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.