పాతికేళ్లపాటు కొనేందుకు ఈఆర్సీ పచ్చజెండా
ఈ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన
ఎన్టీటీపీఎస్ స్టేజ్-4లో యూనిట్ 4.03కే
సెకీ నుంచి ఇప్పుడు కొనుగోలుచేస్తే 4.16
డీల్ అమల్లోకి వచ్చే 2024నాటికి ఇంకెంతో!
మోయలేని భారమేనని తేల్చిన నిపుణులు
సర్కారే భరిస్తుందని ప్రకటనలు చేస్తున్నా
అంతిమంగా వినియోగదారుపైనే వేటు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన ఆఫ్ ఇండియా (సెకీ) మాటున అదానీ గ్రూపు నుంచి రాష్ట్రప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు మండలి గ్రీనసిగ్నల్ ఇవ్వడమే దీనికి కారణం. థర్మల్ విద్యుత్ ధర కూడా తక్కువగా ఉన్న సమయంలో పాతికేళ్లపాటు అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడం వెనుక మతలబేంటని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో సెకీ తక్కువ ధరకే (రూ.3 కంటే తక్కువే) ఒప్పందాలు చేసుకుంది. కానీ జగన్ సర్కారు మాత్రం ఏకంగా యూనిట్ రూ.4.16కు కొంటోంది.
ఇది ప్రస్తుత ధర మాత్రమే. ఆ తర్వాత వివిధ వ్యయాలు పెరిగితే ఆ మేరకు ఇంకా పెరుగుతుంది. ఈ విషయాన్ని ఇంధన శాఖ ఎక్కడా బయటపెట్టడం లేదు. ప్రజాప్రతినిధులు, నిపుణులు చేసిన సూచనలు, వినతులను ఈఆర్సీ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగానే పాతరేసింది. ఇంధన శాఖ పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకే ఈ కరెంటు కొంటున్నారని సర్టిఫికెట్ కూడా దయచేసింది. దీని ప్రకారం.. మూడు దశల్లో 7,000 మెగావాట్ల విద్యుత్తును ‘సెకీ’ అందించనుంది.
ఈ మేరకు డిస్కమ్‌ల తరఫున ఆంధ్రప్రదేశ సెంట్రల్ పవర్ డిసి్ట్రబ్యూషన కంపెనీ లిమిటెడ్ (ఏపీసీడీసీఎల్) దానితో ఒప్పందాలు చేసుకోనుంది. 2024 నుంచి అమల్లోకి వచ్చి 25ఏళ్ల పాటు ఈ కొనుగోలు ఒప్పందం కొనసాగుతుంది. అయితే కొనుగోలు ధరను ఈఆర్సీ ఎక్కడా ప్రస్తావించకపోవడమే ఇక్కడ విశేషం. సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అస్థిర చార్జీ యూనిట్‌కు రూ.2.49. ఈ ధరకు కొంటేనే అతి తక్కువకు కరెంటు దొరుకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ చెబుతోంది. ఈ అస్థిర చార్జీకి అదనంగా స్థిర చార్జీలు దాదాపు రూ.1.67 వరకూ అవుతాయని, దీంతో యూనిట్ ధర రూ.4.16కు చేరుతుందని అధికారికంగా వెల్లడించింది.
ఇది కూడా ఇప్పటి ధరగానే ప్రకటిస్తోంది. వినియోగదారుడికి ఎంత ధరకు విద్యుత్ ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయడం లేదు. కొత్త ఇంధన చట్టాల ప్రకారం జీఎస్టీ వంటి పన్నులను కొనుగోలుదారే భరించాల్సి ఉంది. అయితే, ఇప్పుడు కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చేది 2024లోనే. ఆ రోజు ఉన్న లెక్కల ప్రకారమే జీఎస్టీ తదితర పన్నులు వర్తిస్తాయి. ఈ వ్యయాలన్నీ కలుపుకొంటే యూనిట్ ధర రూ.4.16కే దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేమని ఇంధన, విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వెల్లడించిన ధర కంటే ఎక్కువ వ్యయమే అవుతుందని పేర్కొంటున్నారు. ఈ భారం తానే మోస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అంతిమంగా వినియోగదారునిపై వేటు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. అంతేగాక.. సౌర విద్యుత్తుపైనే పూర్తిగా ఆధారపడడం కూడా తప్పేనని అభిప్రాయపడుతున్నారు.
రూ.వందల కోట్ల మిగులు
విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం స్టేజ్-4లో యూనిట్‌కు స్థిర చార్జీ రూ.0.88, అస్థిర చార్జీ రూ.3.15 కలుపుకొంటే రూ.4.03కే వస్తోంది. సెకీ ఇచ్చే సోలార్ విద్యుత్ కంటే బొగ్గు ఆధారిత జెన్కో విద్యుత్ 13 పైసలు తక్కువకే వస్తోందని ఇంధన శాఖ లెక్కలే వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన మొత్తం మిగులు రూ.వందల కోట్లలో ఉంటుంది. అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని బుకాయిస్తున్న ఇంధనశాఖ.. తన పరిధిలోని జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థలు అందిస్తున్న కరెంటు వ్యయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో చౌకగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే, ఎక్ఛ్సేంజ్‌లో కొనుగోలు చేస్తున్న అస్థిర చార్జీల ధరలను బయటకు వెల్లడిస్తూ, స్థిర చార్జీలను మాత్రం దాచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే జెన్కో, ట్రాన్సకో వెబ్సైట్లలో విలువైన సమాచారం అందుబాటులో లేకుండా ఇంధనశాఖ జాగ్రత్త పడింది.