పాఠశాలల విలీనానికి సంబంధించి వివాదాలు రేగుతున్న సమయంలో ఓ వైపు ఏపీటీఎఫ్ లాంటి సంఘాలు నిరసన దీక్షలు చేపడుతున్న సందర్భంలో జగన్ సర్కార్ దిగివచ్చింది. అమ్మ ఒడి వద్దు ఏమీ వద్దు… ఫస్ట్ మా స్కూలు మాకు ఇచ్చెయ్ అని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రుల ఆగ్రహంతో జగన్ సర్కారుకి దిమ్మ తిరిగింది. విలీనానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అర్థం చేసుకునేందుకు సిద్ధం అయింది.
ఇవాళ ఏపీ ఎన్జీఓ సంఘాలు కూడా జిల్లా కేంద్రాలలో ధర్మ పోరాట దీక్షలకు సిద్ధం అవుతున్న నేపథ్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రుల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న జగన్ ఎట్టకేలకు దిగివచ్చారు. కాస్త పునరాలోచన ధోరణికి ప్రాధాన్యం ఇస్తూ విలీనంపై మరోసారి పరిశీలన చేయడమే కాదు అందుకు తగ్గ ప్రతిపాదనల్లో శాస్త్రీయత లోపిస్తే వాటిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకునేలా జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానీ ఈనిర్ణయంపైకూడా కొంత రచ్చ నడుస్తోంది.
తమకు కమిటీలూ కాఫీ టీలూ వద్దే వద్దని విలీనం వద్దేవద్దని యథాతథంగా ఉండాలని స్థానిక ప్రజలు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వినకపోతే ఎలా అయినా ప్రభుత్వాన్ని తమ దార్లోకి తెచ్చుకుంటామ ని, తమ మాట వినే విధంగా చేస్తామని అంటున్నాయి.
ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు అయిన రైల్వే క్రాసింగ్ లు దాటడం, వాగులు, వంకలూ దాటడం వంటి విషయాలపై కలెక్టర్లు మరోసారి పరిశీలన చేయాలని ఆదేశిస్తూ జగన్ ఇప్పటికే కలెక్టర్లకు మార్గ నిర్దేశం చేశారు అని ప్రధాన మీడియా చెబుతోంది. ఇప్పటికే విలీనాన్ని వ్యతిరేకిస్తూ 70 మంది ఎమ్మెల్యేలు మంత్రి బొత్స కు లేఖలు రాసిన వైనాన్నీ గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా తమ రాజకీయ భవిష్యత్ అన్నది అగమ్యగోచరం కావడం ఖాయమని పేర్కొంటూ పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే సీఎం ఎదుట కూడా తేల్చేశారు.
ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా కనీసం వారేం అనుకుంటున్నారో కూడా తెలుసుకోకుండా నూతన విద్యా విధానం పేరిట పాఠశాలల విలీనం చేయడం అస్సలస్సలు తగని పని అని సొంత పార్టీ మనుషులే కాదు సాక్షాత్తూ పార్లమెంట్ లో కూడా ఇదే వివాదంపై ఎంపీ రామూ మాట్లాడారు. అదేవిధంగా వైసీసీ సర్కారు తీరును నిరసించారు. 377 వ నిబంధన అనుసారం సభలో ఈ విషయాన్ని లేవనెత్తి అందరి దృష్టినీ ముఖ్యంగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇవి కూడా జగన్ ను పునరాలోచనలో పడేశాయని పరిశీలకులు అంటున్నారు.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ సంఘాలు, సీపీఎస్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న సంఘాలు, ఎంప్లాయీస్ అసోసియేషన్లు కొన్ని కలిసి ఇవాళ భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి, అనంతరం ఇక్కడి కలెక్టరేట్ – కు స మీపాన ఉన్న 80 అడుగుల రోడ్డు వద్ద ధర్నా చేశారు. మున్ముందున ఉపాధ్యాయ సంఘాలు అన్నీ సంఘటితం అయి ఈ పోరును తీవ్రతరం చేయనున్నాయి. వీరికి పలు ఉద్యోగ సంఘాలు (ప్రభుత్వ గుర్తింపు పొందిన) మద్దతు ఇవ్వనున్నాయి.
అందుకే జగన్ నేతృత్వాన దిద్దుబాటు చర్యలు వీలున్నంత వేగంగా షురూ కానున్నాయి అని తెలుస్తోంది. కానీ కమిటీల పేరిట కాలయాపన తగదని తాము క్షేత్ర స్థాయిలో వాస్తవాలు విన్నవించాకే, విలీన ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ ఉన్నామని అధికార పార్టీకి చెందిన నాయకులే కాదు విపక్ష నేతలు కూడా చెబుతున్నారు అని తెలుస్తోంది.