సమంత కొత్త సినిమా శాకుంతలం విడుదల కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ భారీ పీరియాడిక్ మూవీ షూటింగ్‌ను దర్శకుడు గుణశేఖర్ వేగంగానే లాగించేశాడు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాత్రం చాలా సమయం తీసుకున్నాడు.
గత ఏడాదే రావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి ఫిబ్రవరి 17కు ఫిక్స్ అయింది. ఈసారి రిలీజ్ పక్కా అనే అంతా అనుకుంటూ వచ్చారు. ఆ దిశగా ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి సినిమా మళ్లీ వాయిదా అనే ప్రచారం కొంచెం గట్టిగానే జరుగుతోంది. దీంతో మళ్లీ ఏం సమస్య వచ్చిందా అని సామ్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈసారి వాయిదాకు కారణం.. హిందీ రిలీజ్ విషయంలో తలెత్తిన సమస్యేనంటున్నారు.
శాకుంతలంను పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శివరాత్రికి హిందీలోనూ కొంచెం పెద్ద రిలీజ్‌కే సన్నాహాలు జరిగాయి. కానీ ఫిబ్రవరి 10న రావాల్సిన షెజాదా వారం వాయిదా పడి 17కు ఫిక్స్ కావడంతో శాకుంతలంకు థియేటర్ల సమస్య తలెత్తింది.
హిందీలో సరైన రిలీజ్ దక్కట్లేదని మొత్తంగా సినిమాను వాయిదా వేసేశారట. ఐతే శాకుంతలంకు హిందీలో ప్రస్తుతానికి పెద్ద బజ్ అయితే లేదు. సామ్ సహా ఇందులోని నటీనటులెవరూ హింందీలో సినిమాలు చేయలేదు. అలాంటపుడు అక్కడ ఈ సినిమా అద్భుతాలు చేసేస్తుందని ఆశించలేం.
టాక్ బాగుండి, జనాలు రావడం మొదలైతే తర్వాత థియేటర్లు పెంచుకునే ఛాన్సుంటుంది. కేవలం హిందీలో రిలీజ్ వీక్‌లో చాలినన్ని థియేటర్లు దొరకట్లేదని శివరాత్రి వీకెండ్ లాంటి మంచి టైమింగ్‌ను వదులుకుని సినిమాను వాయిదా వేసుకోవడం కరెక్టేనా అన్నది ప్రశ్న.